పక్కాగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
కలెక్టర్ నాగరాణి
భీమవరం: జిల్లాలో ప్రజల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలుచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, ఆక్రమణల తొలగింపు, ఐరాడ్ వెబ్‌సైట్‌లో యాక్సిడెంట్ డెత్ కేసుల నమోదు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ముందుగా భీమవరంలో ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై భీమవరం డీఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ భీమవరంలో నిర్మాణంలో ఉన్న మూడు రోడ్లను డిసెంబర్ 15 నాటికి పూర్తిచేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి టీం వర్క్‌గా పనిచేయాలని సూచించారు. డీఎస్పీలు ఆర్.జయసూర్య, డి.విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్‌ఎండీ కృష్ణారావు, 216 నేషనల్ హైవే పీడీ బి శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ 165 హైవే డీఈ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


