లక్కవరం దోపిడీ కేసులో మరో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ ఇంట్లో జరిగిన దోపిడీ కేసులో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథం తెలిపారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆమె వివరాలు వెల్లడించారు. లక్కవరం గ్రామంలోని రామాలయం వీధిలోని లక్ష్మీకుమారి ఇంట్లో గత సెప్టెంబర్ 23న తెల్లవారుజామును దండుగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆమె భర్తను కర్రలతో కొట్టి బీరువాలోని సుమారు 40 కాసుల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి వస్తువులు దోచుకుపోయారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి గతంలో అంగడి విల్సన్‌బాబు, గజ్జెల వాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్ బాజీలను అరెస్టు చేయగా, కేసులో 5వ నిందితుడిగా ఉన్న కావేటి చిన్నా అలియాస్ ప్రసాద్, అలియాస్ రమేష్, అలియాస్ రాముని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. కావేటి చిన్నాపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, బాపట్ల జిల్లాలు, గుంటూరు అర్బన్, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయన్నారు. అలాగే కామవరపుకోట చింతలపూడి రోడ్‌లో వృద్ధురాలి మెడలోని రెండు కాసుల బంగారు గొలుసు చోరీ చేశాడన్నారు.
చోరీ సొత్తు రికవరీ
లక్కవరం చోరీకి కేసుకు సంబంధించి గతంలో అరెస్టు చేసిన నిందితులు అంగడి విల్సన్‌బాబు, గజ్జెల వాసు, దేవర శ్రీరామమూర్తి, షేక్ బాజీల నుంచి రూ.30 లక్షలు విలువైన 246 గ్రాముల బంగారం రికవరీ చేయగా గురువారం 5వ నిందితుడు కావేటి చిన్న నుంచి రూ.12 లక్షలు విలువైన 70.860 గ్రాముల బంగారం, 1.704కేజీల వెండి, మొత్తంగా రూ. 42 లక్షలు విలువైన సొత్తును రికవరీ చేసినట్లు చెప్పారు. కేసు చేధనలో కృషిచేసిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై షేక్ జబీర్, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, పీసీలు షేక్ షాన్‌బాబు, ఎన్.రమేష్‌లను ఎస్పీ కేపీఎస్ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాధన్‌లు అభినందించారు.


