నాణ్యత లేని ఆహారం అందిస్తే చర్యలు
ఉండి: విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జూపూడి కిరణ్ హెచ్చరించారు. గురువారం ఉండి జడ్పీ హైస్కూల్‌తో పాటు కాపులపేటలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించగా కోడిగుడ్లు దుర్వాసన రావడం, అన్నం గట్టిగా ఉండడం, కూరల్లో నాణ్యత లేకపోవడంతో తినలేకపోతున్నామంటూ పలువురు విద్యార్థులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు అందించే ఆహారంలో లోటుపాట్లు రావడం బాధాకరమని, విద్యార్థుల ఫిర్యాదులను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అనంతరం మధ్యాహ్నా భోజనాన్ని కిరణ్ రుచి చూచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లు లేదా పాఠశాలల్లో ఎక్కడైనా నాణ్యత లేని ఆహారం అందిస్తే వెంటనే 99639 85678 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. నాణ్యమైన భోజనం, రుచికరమైన పదార్థాలు అందించాల్సిన బాధ్యత సదరు ఏజెన్సీలు, నిర్వాహకులపై ఉందని, నిబంధనలు మీరితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అంగన్‌వాడీల్లో విద్యార్థులకు అందించే ఆహారంపై సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో నారాయణ, డీఎస్‌ఓ ఎన్ సరోజా, డీఈవో ఆఫీస్ ఏడీ ఎన్ సత్యనారాయణ, ఎంఈవోలు బీ జ్యోతి, బీ వినాయకుడు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జూపూడి కిరణ్


