మొక్కల నరికివేతపై చర్యలు తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం: మామిడి, జీడి, జామాయిల్ మొక్కలను అక్రమంగా నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.జీవరత్నం డిమాండ్ చేశారు. మైసన్నగూడెంలో మామిడి, జీడిమామిడి, జామాయిల్ మొక్కలు నరికివేత ఘటనపై ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన పిల్లి పోతురాజు, పులపాకుల వీర్రాజు, పిల్లి వెంకట సుబ్బారావు, గుద్దాటి సూర్యకిరణ్ నాలుగు ఎకరాల భూమిని గత పదేళ్లుగా సాగుచేస్తున్నారన్నారు. ఆ భూమిలో మామిడి, జీడి, జామాయిల్ మొక్కలను పెంచుతున్నారన్నారు. సదరు భూమికి సంబంధించి విచారణ చేసి పట్టాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గతంలో ఒకసారి కొన్ని మొక్కలు నరికి వేశారని, బాధిత రైతులు ఫిర్యాదు చేయగా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ ఈనెల 12వ తేదీ రాత్రి మరోసారి వారు భూమిలో అక్రమంగా ప్రవేశించి మొక్కలను నరికివేశారని తెలిపారు. తక్షణమే పోలీసు వారు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకొని బాధితులకు రెవెన్యూ చట్టం ప్రకారం నష్టపరిహారం రూ.4 లక్షలు ఇప్పించాలని కోరారు. సత్వరం బాధితులకు న్యాయం చేయకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని జీవరత్నం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


