మాంసాహారం.. డల్లుగా వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం

Nov 14 2025 5:48 AM | Updated on Nov 14 2025 5:48 AM

మాంసా

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం

వ్యాపారం భారీగా తగ్గింది

ఫిబ్రవరి వరకు ఇంతేనేమో!

కార్తీకం ఎఫెక్ట్‌తో తగ్గిన మాంసాహార వినియోగం

వ్యాపారాలు లేవంటున్న మాంసం వ్యాపారులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : మారిన ప్రజల ఆహారపు అలవాట్లలో భాగంగా మాంసాహార ప్రియులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా చికెన్‌ జాయింట్లు, చికెన్‌ ఫ్రైలు, చికెన్‌ టిక్కాలు, కబాబులు, తండూరి చికెన్లు ఇలా అల్పాహారాలు సైతం మాంసాహారానికి సంబంధించినవే ఉంటున్నాయి. ఇక ప్రజల భోజనాల్లోకి బిర్యానీలు చొచ్చుకువచ్చాయి. దీంతో ఏమూల చూసినా బిర్యానీ పాయింట్లు, నాన్‌ వెజ్‌ రెస్టారెంట్లు దర్శనమిచ్చి వారి వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే కార్తీక మాసం కావడంతో గత 20 రోజులుగా మాంసాహార వినియోగం తగ్గింది. దాదాపు 50 శాతం వ్యాపారాలు పడిపోయాయని మాంసాహార వ్యాపారులు చెబుతున్నారు.

కార్తీకం.. ప్రత్యేకం

కార్తీక మాసం హిందువుల్లో ప్రత్యేక మాసంగా పరిగణించబడుతోంది. నిత్యం మాంసాహారం తీసుకునే వారు సైతం ఈ కార్తీక మాసంలో మాంసం జోలికి వెళ్లడం లేదు. దీనికి తోడు అనేక మంది అయ్యప్ప మాలలు ధరించడం, వాటితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల, సాయి బాబా మాల ఇలా వివిధ దేవతల పేరిట మాలలు ధరించి సుమారు 45 రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో వ్యాపారాలు లేక మాంసం వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. కొందరు వ్యాపారులకు కనీసం రోటేషన్‌ జరిగే స్థాయిలో కూడా వ్యాపారం జరగడంలేదని వాపోతున్నారు. కొందరు అప్పులు చేసి వ్యాపారాలు చేస్తుండగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి కూడా కనిపించడంలేదంటున్నారు. ప్రతీ ఏటా ఈ పరిస్థితి సాధారణమే అయినప్పటికీ ఈ ఏడాది ఎఫెక్ట్‌ మరింత ఎక్కువగానే ఉందంటున్నారు.

నిలకడగానే ధరలు

సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే కోడి మాంసం ధరలు తగ్గుతాయి. వేట మాసం, చేపలు, రొయ్యల ధరల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది చికెన్‌ ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కార్తీక మాసానికి ముందు కిలో స్కిన్‌లెస్‌ రూ. 240, స్కిన్‌తో రూ. 200 నుంచి రూ. 220 వరకూ విక్రయించే వారు. గతంలో కార్తీక మాసంలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.180కు, స్కిన్‌తో రూ. 160కు పడిపోయేది. ఈ ఏడాది మాత్రం కార్తీక మాసానికి ముందు ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. వినియోగం తగ్గినా ధరలు తగ్గక పోవడం కూడా మాంసం వ్యాపారాలు తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. కార్తీక మాసం తరువాత కూడా మాంసాహారం వినియోగం పెద్దగా పెరిగే సూచనలు కనిపించడంలేదు. వివిధ దేవతల మాలల దీక్షలు జనవరి వరకూ కొనసాగనుండడంతో వారి కుటుంబ సభ్యులు సైతం మాంసాహారానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీంతో మాంసం వ్యాపారాలు తగ్గిన దానిలో 20 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

చికెన్‌ వ్యాపారం ఈ ఏడాది భారీగా తగ్గింది. కార్తీక మాసంలో వ్యాపారం తగ్గడం సర్వసాధారణమే కాఈన ఈ ఏడాది అంతకు మించి తగ్గడానికి కారణం తెలియడం లేదు. బహుశా మాలలు ధరించిన వారు ఎక్కువ మంది ఉండి ఉంటారనే అనుకుంటున్నాము.

– షేక్‌ మహబూబ్‌ జానీ, చికెన్‌ వ్యాపారి

కార్తీక మాసం అయినా మటన్‌ ధర నిలకడగానే ఉంటుంది. కానీ ఈ ఏడాది మాంసం వినియోగం తగ్గడంతో మాంసాహార ప్రియులను ఆకర్షించడానికి కొద్దిగా ధరలు తగ్గినా వ్యాపారాలు పెరగలేదు. ఈ పరిస్థితి వచ్చే ఫిబ్రవరి వరకూ ఉండేలా కనిపిస్తోంది. ఏలూరులో జాతర రోజు వరకూ మాంసం వినియోగం తగ్గిస్తారని అంటున్నారు.

– షేక్‌ మున్వర్‌ అలీ, మటన్‌ వ్యాపారి

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం1
1/3

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం2
2/3

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం3
3/3

మాంసాహారం.. డల్లుగా వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement