గోదావరిలో యువకుడి గల్లంతు !
యలమంచిలి: మొగల్తూరు మండలం కుమ్మరపురుగుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు (35) చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దూకి గల్లంతై ఉంటాడని అతని అన్నయ్య కొత్తపల్లి జల దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కర్ణీడి గురుయ్య తెలిపారు. వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం సుబ్బారావు తన బైక్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతని బైక్, సెల్, చెప్పులు చించినాడ వంతెనపై కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో చించినాడ వచ్చి చూడగా బైక్, సెల్, చెప్పులు సుబ్బారావువే అని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.
పాలకొల్లు సెంట్రల్: అడ్డు వచ్చిన కుక్కను తప్పించే యత్నంలో ఓ కారు బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి పాలకొల్లు నుంచి ముగ్గురు వ్యక్తులు కారులో బయలుదేరి దిండి వెళుతున్నారు. దిగమర్రు బైపాస్ రోడ్డులో పెదమామిడిపల్లి చేరుకునే సరికి ఓ శునకం అడ్డురావడంతో దానిని తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా పడి పక్కనే ఉన్న వరి చేలోకి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భీమవరం అర్బన్: తను ప్రేమించిన వ్యక్తికి మరొకరితో నిశ్చితార్థం కావడంతో మనస్థాపం చెందిన డెంటల్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సఖిల్‌గూడ ప్రాంతానికి చెందిన నిమ్మల సింహాచలం కుమార్తె హేమవర్షిని (22) భీమవరంలోని విష్ణు కళాశాలలో 2021 సంవత్సరం నుంచి డెంటల్ కోర్సు చదవుతోంది. సమీపంలోని కొవ్వాడ గ్రామంలో నందననాయుడు ఇంట్లో అద్దెకు ఉంటుంది. అదే కళాశాలలో విద్యనభ్యసిస్తున్న చిట్టుమూరి నవీన్‌రెడ్డికి, హేమ వర్షినికి గత రెండేళ్లుగా పరిచయం ఏర్పడింది. నవీన్ రెడ్డి వారం క్రితం హేమ వర్షిణికి ఫోన్ చేసి తనకు నిశ్చితార్థం అయిందని చెప్పాడు. దీంతో హేమవర్షిని మనస్థాపం చెంది బుధవారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విద్యార్థిని తండ్రి నిమ్మల సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేయగా రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యలమంచిలి: చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాల ప్రకారం ఊటాడ పెదపేటకు చెందిన కాకిలేటి రాహుల్ (22) మద్యానికి బానిస కావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా అతడిని కుటుంబ సభ్యులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సోదరుడు నవరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.


