చైర్మన్ చొరవతో కార్మికులకు తిరిగి ఉపాధి
● శ్రీవారి దేవస్థానంలో కాంట్రాక్టర్ కొత్త రూల్
● 50 ఏళ్లు పైబడిన కార్మికుల తొలగింపు
● బాధితులకు బాసటగా నిలిచిన చైర్మన్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు చొరవతో ఇటీవల విధుల నుంచి తొలగింపబడిన పారిశుధ్య కార్మికులకు తిరిగి ఉపాధి లభించింది. వివరాల్లోకి వెళితే గతనెల 1 న ద్వారకాతిరుమల, అన్నవరం దేవస్థానాల్లో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్(తిరుపతి) సంస్థ పారిశుధ్య, ఇతర పనులకు సంబంధించిన కాంట్రాక్టును చేపట్టింది. ద్వారకాతిరుమల దేవస్థానంలో పారిశుధ్య, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటర్లు, తాపీ పని, తదితర పనులకు సంబంధించిన కార్మికులు సుమారు 190 మంది పనిచేస్తుండగా వారంతా గతనెల 1 నుంచి పద్మావతి సంస్థ ఆధీనంలోకి వెళ్లారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ 50 ఏళ్ల వయస్సు పైబడిన కార్మికులను ఈనెల 1 నుంచి తొలగిస్తూ కొత్త రూల్‌ను అమలు చేశారు. దాంతో 26 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయి, రోడ్డున పడ్డారు. బాధిత కార్మికులు చైర్మన్ సుధాకరరావును కలసి మొరపెట్టుకున్నారు. ఆయన కార్మికులకు బాసటగా నిలిచి, సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల పొట్టగొట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దాంతో చేసేదేమీ లేక 60 ఏళ్ల వయస్సు పైబడిన ముగ్గురు, నలుగురు కార్మికులను మినహా మిగిలిన వారందరినీ విధుల్లోకి తీసుకున్నారు. కాగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో 50 ఏళ్లు వయస్సు పైబడిన 45 మందిని విధుల నుంచి తొలగించగా వారిని కాంట్రాక్టర్ నేటికీ విధుల్లోకి తీసుకోలేదు.


