శ్రీవారి అంతరాలయ దర్శన ప్రాప్తిరస్తు
ద్వారకాతిరుమల: శ్రీవారి అంతరాలయ దర్శనం కోసం భక్తులు ఎన్నో ఏళ్ల నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దగ్గర నుంచి ఆ దేవదేవుడిని కనులారా వీక్షించాలని తహతహలాడుతున్నారు. అయితే ఆ సమయం రానేవచ్చింది. ఈనెల 27 నుంచి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి బుధవారం ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి కారణంగా ఐదేళ్ల క్రితం స్వామివారి అంతరాలయ దర్శనాన్ని, అలాగే అమ్మవార్ల ముందు నుంచి క్యూలైన్లలో వెళ్లే విధానాన్ని రద్దు చేశారు. కోవిడ్ అనంతరం ఇతర దేవాలయాల్లో అంతరాలయ దర్శనాలు పునః ప్రారంభం అయినప్పటికీ, ఈ ఆలయంలో మాత్రం పునరుద్ధరణ కాలేదు. గతంలో కంటే ఆలయంలో భక్తుల రద్దీ పెరగడం, అంతరాలయ భాగం ఇరుకుగా ఉండటమే అంతరాలయ దర్శనాన్ని పునరుద్ధరించక పోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే అంతరాలయ దర్శనం కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న నేపధ్యంలో, ఈ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్టు ఈఓ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంతరాలయం ముందు భాగంలో గతంలో ఉన్న చెక్కల ర్యాంపు ఏళ్లతరబడి మూలన పడి ఉండటంతో దెబ్బతింది. దానికి మరమ్మతులు చేసి, ఆలయ ఆవరణలో ఉంచారు.
ప్రస్తుతం వీఐపీలకు మాత్రమే
ప్రస్తుతం వీఐపీలకు, వారు సిఫార్సు చేసిన వారికి మాత్రమే అంతరాలయ దర్శన భాగ్యం కలుగుతోంది. సామాన్య భక్తులు దూరం నుంచే స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఓ వృద్ధ దంపతులు అంతరాలయ దర్శనం కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు నుంచి లెటర్ తెచ్చారు. దాన్ని ఎవరికి అందజేయాలో తెలియక చాలాసేపు ఆలయంలోనే తిరిగారు. వారిని చూస్తే.. స్వామివారి అంతరాలయ దర్శనం కోసం భక్తులు ఇంతిలా ఆరాటపడుతున్నారా.. అని అక్కడున్న వారందరికీ అనిపించింది.
టికెట్‌తో దళారులకు చెక్..
ఈనెల 27 నుంచి అంతరాలయ దర్శనానికి వెళ్లే ఒక్కో భక్తుడు రూ. 500 టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాంతో ఇక దళారులకు చెక్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం అంతరాలయ దర్శనం కోసం కొందరు భక్తులు పలుకుబడి, పేరు ఉన్న దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు టికెట్ పెట్టడం వల్ల భక్తులకు దళారులతో పని ఉండదని, ఆ సొమ్ము దేవుడికే చెందుతుందని పలువురు అంటున్నారు.
ఈనెల 27 నుంచి శ్రీవారి అంతరాలయ దర్శనం
చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
టికెట్ రుసుం ఒక్కొక్కరికి రూ.500
ఇక దళారులకు చెక్ పడినట్టే
శ్రీవారి అంతరాలయ దర్శన ప్రాప్తిరస్తు


