గ్రావెల్ దోపిడీని అడ్డుకున్న గ్రామస్తులు
నూజివీడు: మట్టి, గ్రావెల్ ఎక్కడ కనబడినా దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. మండలంలోని హనుమంతులగూడెంలో మంగళవారం అర్ధరాత్రి పట్టణానికి చెందిన ఒక టీడీపీ చోటా నాయకుడు టిప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డం తిరిగారు. గ్రామానికి సమీపంలోని రేలపోడు తిప్పలో నూజివీడుకు చెందిన ఒక వ్యక్తి రాత్రి 10 గంటల నుంచి నాలుగు టిప్పర్లు పెట్టి పొక్లెయిన్‌తో గ్రావెల్‌ను తవ్వి లోడు చేసి వెళ్తుండగా గ్రామం వద్ద దాదాపు 30మంది గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి గ్రావెల్‌ను తవ్వి తరలించడానికి నువ్వెవరవంటూ నిలదీశారు. దీంతో టిప్పర్లకు అడ్డం వచ్చారంటే తొక్కించేస్తామని, కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరించారు. అయినప్పటికి గ్రామస్తులు బెదరకుండా గ్రావెల్‌ను తరలించే టిప్పర్లకు అడ్డంగా రోడ్డుపై ట్రాక్టర్‌ను అడ్డుగా ఉంచి టిప్పర్లను ఆపేశారు. తరువాత రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ఫోన్‌లు చేసినా వారెవరూ స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక అర్ధరాత్రి 12 గంటల సమయంలో టిప్పర్లలోని గ్రావెల్‌ను అక్కడే అన్‌లోడ్ చేసి ఖాళీగా వెళ్లిపోయారు.
పేట్రేగిపోతున్న అక్రమార్కులు
అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతిరోజూ రాత్రి సమయంలో టిప్పర్లు పెట్టి నూజివీడు, విస్సన్నపేట, ముసునూరు, ఆగిరిపల్లి, విజయవాడ వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్‌ను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత దారుణంగా గ్రావెల్ దోపిడీ ఎన్నడూ జరగలేదని, ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో కొండలేవీ కనిపించవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


