
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
భీమవరం: కేంద్రం ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పిలిచిన ప్రైవేటు టెండర్లను తక్షణం ఉపసంహరించుకోచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో నిర్వహిస్తున్న పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 35 భాగాలుగా విడదీసి ప్రైవేట్ టెండర్ పిలిస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫ్యాక్టరీ కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ఇప్పటికే ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడుతామని చెప్పి నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బబలరామ్ హెచ్చరించారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ చదివి 35 ఏళ్ల లోపు వున్న షెడ్యూల్డు కులాలకు చెందిన యువతులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. 8 నెలల నుంచి 10 నెలల వరకు శిక్షణ ఉంటుందని, శిక్షణ సమయములో ఉచిత వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణానంతరం జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం కల్పిస్తారన్నారు. ఈ శిక్షణకు జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 8333040217, 9885609777, 9346890335 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
ఆగిరిపల్లి: తన సోదరుడు కనబడడం లేదని అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శుభశేఖర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నెక్కలం గొల్లగూడెంలో అక్క ఇంటి వద్ద ఉంటున్న బొక్కినాల నరేష్ ఈనెల 18 నుంచి కనిపించడం లేదు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.