
ఇప్పుడు నిషేధమంటే ఎలా?
విగ్రహాల తయారీనేజీవనాధారం
ముందుగా చెప్పాలి
భీమవరం : వినాయక చవితి ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ)తో తయారుచేసిన విగ్రహాలను నిషేధించాలంటూ కలెక్టర్ చేసిన ప్రకటనతో విగ్రహాల తయారీదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వందలాది విగ్రహాలను తయారుచేసి అమ్మకాలకు సిద్ధం చేసిన సమయంలో కలెక్టర్ ప్రకటన తమ పొట్టకొట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సంప్రదాయ ఉత్సవాల్లో వినాయక చవితికి అత్యంత ప్రాధాన్యత ఉంది. చవితి పండుగకు ఏడెనిమిది నెలల ముందు నుంచే అనేక ప్రాంతాల్లో విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. దీనికి గాను లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. విగ్రహాలు అమ్మి చేసిన అప్పులు తీర్చుకుని మిగిలిన కాస్తో కూస్తో సొమ్ములతో జీవించాలని ఆశతో ఎదురుచూస్తున్న విగ్రహాల తయారీదారులకు పీఓపీ విగ్రహాల అమ్మకాలు నిలిచిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి విగ్రహాల తయారీ కష్టం కావడంతో పాటు పీఓపీ విగ్రహాల పట్ల మోజు పెరగడంతో కొన్ని ఉత్సవ కమిటీలు పోటీలు పడి పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో వినాయక విగ్రహాల తయారుదారులు సైతం వివిధ రకాల సైజులు, ఆకారాల్లో ఆకర్షణీయమైన రంగుల్లో విగ్రహాలను తయారుచేస్తున్నారు. దీనికిగాను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే వినాయక చవితికి జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే విగ్రహాల తయారీ ప్రారంభిస్తున్నారు. కొంతమంది పెద్ద మొత్తంలో సొమ్ములు అప్పులు చేసి ప్రత్యేకంగా కార్మికులను పెట్టుకుని విగ్రహాల తయారీ ద్వారా ఉపాధి కల్పించడంతోపాటు జీవనోపాధి పొందుతున్నారు. వర్షాకాలంలో సైతం విగ్రహాలు తడిచిపోకుండా షెల్టర్స్ ఏర్పాటుచేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, సిద్దాంతం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, ఆకివీడు, విస్సాకోడేరు తదితర ప్రాంతాల్లో పీఓపీ విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయక విగ్రహాలతోపాటు దసరా సందర్బంగా కనక దుర్గమ్మ విగ్రహాలను తయారుచేసి విక్రయిస్తుంటారు. అయితే పీఓపీ విగ్రహాల నిషేధమని కలెక్టర్ ప్రకటించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ది ఉంటే పీఓపీ విగ్రహాల తయారీ ప్రారంభ సమయంలోనే అడ్డుకుని ఉంటే తాము ప్రత్యామ్నాయ ఉపాధిని వెదుక్కుని దానిలో స్థిరపడేవాళ్లమని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తయారుచేసిన తరువాత నిషేధం ఏంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రంగులు, ఆకారాల్లో వినాయక విగ్రహాలు
నేను ఏటా వినాయక విగ్రహాల తయారీ ద్వారా జీవనోపాధి పొందడమేగాక మరొక 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఏటా చవితికి దాదాపు ఆరేడు నెలల ముందుగానే విగ్రహాలు తయారుచేస్తాం. ఇప్పటికే మా వద్ద 200 వరకు విగ్రహాలున్నాయి. అప్పులు తెచ్చి దాదాపు రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. ఇలాంటి తరుణంలో పీఓపీ విగ్రహాలు నిషేధంమంటే మా పరిస్థితి ఏంటి.?
– ఇంటి ప్రసాద్, విగ్రహాల తయారీదారుడు, వరిధనం, పాలకొల్లు మండలం
వినాయక చవితి, దసరా ఉత్సవాలకు విగ్రహాలను తయారుచేయడం ద్వారా ఉపాధి పొందుతున్నాం. విగ్రహాల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాం. గతంలో మట్టి విగ్రహాలు తయారుచేసినా నేడు పీఓపీ విగ్రహాలకు ఆదరణ పెరగడంతో వాటిని తయారుచేస్తున్నాం. ఫిబ్రవరి నెలలోనే విగ్రహాల తయారీ ప్రారంభించాం. ఇప్పుడు పీఓపీ విగ్రహాలు నిషేధం అంటూ ప్రకటనలు చేయడం ఎంతవరకు న్యాయం.
– కె మల్లిఖార్జునరావు, విగ్రహాల తయారీదారుడు, పూలపల్లి
పీఓపీ విగ్రహాల తయారీదారుల ఆందోళన
రూ.లక్షల పెట్టుబడితో పెద్ద సంఖ్యలో విగ్రహాల తయారీ
ఇప్పుడు కలెక్టర్ ప్రకటనతో ఆందోళనలో తయారీదారులు

ఇప్పుడు నిషేధమంటే ఎలా?

ఇప్పుడు నిషేధమంటే ఎలా?

ఇప్పుడు నిషేధమంటే ఎలా?

ఇప్పుడు నిషేధమంటే ఎలా?

ఇప్పుడు నిషేధమంటే ఎలా?