
యూరియా సరఫరాలో విఫలం
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో రైతులకు యూరియాను సరఫరా చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాంనాయుడు అన్నారు. శనివారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు అన్నింటా అండగా నిలిచిందన్నారు. సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందించడంతో పాటు ఆర్‌బీకేలతో భరోసా కల్పించిందన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, నీరు నిలిచిన మెట్ట పంటలకు, ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియాను వెంటనే వాడాల్సి ఉందని, పదును దాటిన తర్వాత వాడినా ఉపయోగం ఉండదన్నారు. ఈ కారణంతో యూరియా వాడకం పెరిగినా తగిన స్థాయిలో అందుబాటులో లేదన్నారు. యూరియా నిల్వలపై వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి స్థితికి సంబంధం లేదన్నారు. శాసీ్త్రయంగా నిరూపణ కాని నానో యూరియా డబ్బాను రైతులతో బలవంతంగా కొనిపిస్తున్నారన్నారు. సెప్టెంబరు మొదటి వారం తర్వాత కానీ యూరియా రాష్ట్రానికి రాని పరిస్థితులు ఉన్నాయని, వెంటనే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.