కనీసం గుంతలు పూడ్చండి
● అధ్వానంగా రోడ్లు
● వర్షాలతో మరింత ఛిద్రం
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో రోడ్లు ఛిద్రమై ప్రయాణికులను భయపెడుతున్నాయి. పట్టణంలోని కేఎన్ రోడ్డులో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై, ఎన్‌టీఆర్ జంక్షన్ నుంచి తాలూకా సెంటర్ మార్గంలో, బస్సు కాంప్లెక్స్, గొల్లగూడెం సెంటర్, ఎస్‌వీఆర్ సర్కిల్ సెంటర్, మాగంటి కళ్యాణ మండపం,ఏలూరు వైపు యాగర్లపల్లి, పడాల మార్గంలో, రెండో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై, తణుకు వైపు జువ్వలపాలెం మార్గంలో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారా యి. దీంతో ఇటుగా ప్రయాణించే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఛిద్రంగా మారిన రోడ్లు వర్షాల దెబ్బకు మరింత దారుణంగా తయారయ్యాయి. గోతుల్లో వర్షం నీరు నిండి, చిన్నపాటి మరమ్మతులు, ప్యాచ్ వర్కులు చేసిన చోట్ల రాళ్లు, రప్పలు పైకి లేచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 16 నెలలు కావస్తున్నా పట్టణంలో ప్రధాన రహదారులకు పూర్తిస్థాయిలో మోక్షం కలగలేదు. కొన్ని రోడ్లను నామమాత్రపు మరమ్మతులు, ప్యాచ్ వర్కులతో సరిపెట్టారు. అలాగే పట్టణంలోని 35 వార్డుల్లో అంతర్గత రహదారులు కూడా పూర్తిగా పాడయ్యాయి. పట్టణం విద్యా, వాణిజ్య కేంద్రం కావడంతో స్కూల్ బస్సులు, సరుకు రవాణా, ఇతర వాహనాల రాకపోకలు అధికం. గోతులతో ప్రమాదాల బారిన పడటంతో పాటు ఒళ్లు హునం అవుతుందని, వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
పట్టణంలో అన్ని ప్రధాన, అంతర్గత రోడ్లు గుంతలతో నిండిపోయాయి. బైక్‌లు స్కిడ్ అవుతున్నాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కనీసం గుంతలనైనా పూడ్చించాలి. లేకపోతే శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించాలి.
– కె.సుబ్బారావు, తాడేపల్లిగూడెం
గూడెం.. గుంతలమయం
గూడెం.. గుంతలమయం
గూడెం.. గుంతలమయం