గోదావరి ఉగ్రరూపం | - | Sakshi
Sakshi News home page

గోదావరి ఉగ్రరూపం

Aug 21 2025 8:49 AM | Updated on Aug 21 2025 8:49 AM

గోదావ

గోదావరి ఉగ్రరూపం

కోమటిలంకకు రాకపోకలు బంద్‌

యంత్రాంగం సన్నద్ధం

పోలవరం రూరల్‌/వేలేరుపాడు/కుక్కునూరు: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంద్రావతి, ప్రాణహితలు పొంగి ప్రవహిస్తుండటం, దీనికి శబరి తోడు కావడంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం రాత్రి 10 గంటలకు నీటి మట్టం 47 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలుచోట్ల బాధితులను పడవలపై పునరావాస కేంద్రాలకు తరలించారు.

పోలవరం వద్ద 32.20 మీటర్లకు నీటి మట్టం

గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 32.20 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి సుమారు 10 లక్షలకు క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు చేరుతోంది.

నీట మునిగిన వంతెనలు : వరద ప్రభావం వల్ల వేలేరుపాడు మండలంలో మేళ్ల వాగు, ఎద్దెల వాగు, టేకురు వాగు, పెద్దవాగు, వంతెనలు నీట మునిగాయి. దీంతో మండలంలో 26 గ్రామాలకు రాకపోకల స్తంభించాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోట, రేపాక గొమ్ము, కన్నాయగుట్ట, తిర్లాపురం, పాత నార్లవరం వెళ్లే రహదారులు నీట మునిగాయి. అధికారులు మొత్తం మూడు నాటు పడవలు, రెండు లాంచీలు ఏర్పాటు చేశారు. ఎద్దుల వాగు వద్ద నాటు పడవపై ప్రజలు దాటుతున్నారు. ఇంతవరకు 393 కుటుంబాలను కుక్కునూరు మండలంలోని రాయకుంట పునరావాస కాలనీ, తాడువాయిలోని చల్లవారిగూడెం కాలనీలకు తరలించారు

వరద ప్రాంతాల్లో ఎస్పీ పర్యటన : వేలేరుపాడు మండలంలో ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన రేపాక గొమ్ము గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. పశువులను ముందస్తుగా గ్రామం నుంచి తరలించుకోవాలని తెలిపారు. అనంతరం వేలేరుపాడు రుద్రంకోట గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

నీట మునిగిన రహదారి : వరద ఉధృతితో కుక్కునూరు గ్రామ శివారులోని జామాయిల్‌ తోటలు నీటమునిగాయి. వింజరం పంచాయతీలోని ఎర్రబోరు–ముత్యాలంపాడు గ్రామాల మధ్య రహదారి వరద నీటితో నిండిపోయింది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

దెందులూరు: కొల్లేరులో ఏలూరు రూరల్‌ మండలం కోమటిలంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కోమటిలంకలో 1500 మంది నివసిస్తున్నారు. బయటినుంచి కోమటిలంక గ్రామానికి వెళ్లే కల్వర్టు వరద నీటికి మునగిపోయింది. పడవలోనే విద్యార్థులు, ఉద్యోగులు నిత్యవసరాలకు వెళ్లేవారు ప్రయాణిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరుకు కూతవేటు దూరంలో ఉన్న కోమటిలంకను ఇప్పటికీ ఒక్క అధికారి తొంగి చూడలేదు.

ఏలూరు(మెట్రో): జిల్లాలో వరద పరిస్థితిని బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్టాడుతూ.. వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కలెక్టరేట్‌తో పాటు వేలేరుపాడులో 83286 96546, కుక్కునూరు 80962 74662 నెంబర్లతో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించేందుకు మూడు నెలల రేషన్‌ను ఉంచామన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్‌, కేజీ పంచదారతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు బాధిత కుటుంబాలకు అందించేందుకు అందుబాటులో ఉంచామన్నారు.

వేలేరుపాడు మండలంలో 26 గ్రామాలకు రాకపోకలు బంద్‌

పునరావాస శిబిరాలకు వరద బాధితులు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్‌, ఎస్పీ

భద్రాచలం వద్ద 53 అడుగులకు నీటిమట్టం చేరవచ్చని అంచనా

అప్రమత్తమైన యంత్రాంగం.. కంట్రోల్‌రూమ్‌ల ఏర్పాటు

పోలవరం స్పిల్‌వే నుంచి 10 లక్షల క్యూసెక్కులు విడుదల

ముంపు ప్రాంతాల ప్రజలు అధికారులతో సహకరించి వరద సహాయ కేంద్రాలకు తరలి రావాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ అధికారులతో కలిసి బుధవారం ముంపు గ్రామాలైన కట్కూరు, ఎరత్రోలు, బోళ్లపల్లి,, చిత్తంరెడ్దిపాలెం తదితర గ్రామాలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యడపల్లి గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేందుకు బోట్లను పంపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పెద్దవాగు, ఎద్దువాగుల నుంచి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు పొంచి ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు టార్పాలిన్లు అందించామన్నారు. జిల్లాకు ఇప్పటికే 2 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయని చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని గర్భణులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. వరద సహాయక చర్యలపై కలెక్టరేట్‌లో 1800 233 1077, 94910 41419 ఫోన్‌ నెంబర్లతో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామని, జంగారెడ్డిగూడెం, నూజివీడు డివిజన్‌లో, కుక్కునూరు, వేలేరుపాడులలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశామన్నారు. రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూలిన చెట్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వేలేరుపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై వరద పరిస్థితిని కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ రమణ, డీఆర్డిఏ పీడీ ఆర్‌.విజయరాజు తదితరులు ఉన్నారు.

గోదావరి ఉగ్రరూపం 1
1/2

గోదావరి ఉగ్రరూపం

గోదావరి ఉగ్రరూపం 2
2/2

గోదావరి ఉగ్రరూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement