
కొల్లేరు ప్రక్షాళన ప్రశ్నార్థకం
కొల్లేరులో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడానికి పంట కాల్వల్లో కలాసి వ్యవస్థ మాదిరిగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎగువ నుంచి కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క గుదిబండగా మారుతోంది. కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయాలి. ఉప్పుటేరు నుంచి సముద్రానికి నీరు పోయేలా అడ్డంకులను తొలగించాలి.
– సైదు సత్యనారాయణ, కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సంఘాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు
ఉప్పుటేరు వద్ద ఆక్రమణలను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నాం. ప్రధానంగా ఉప్పుటేరుపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి వద్ద గుర్రపుడెక్క, కిక్కిసను 6 పొక్లయిన్‌లతో తీస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగా కాకుండా ముందస్తు చర్యల్లో ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతున్నాయి.
– ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు
కై కలూరు: కొల్లేరు డ్రెయిన్లకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు లోతట్టు గ్రామాలు జలమయమవుతున్నాయి. వరద నీరు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి భారీ డ్రెయిన్లతో పాటు మరో 31 మీడియం, మైనర్ డ్రెయిన్లు, కాలువలు చానల్స్ ద్వారా పెద్ద ఎత్తున కొల్లేరుకు చేరుతుంది. వరదల సమయంలో 1,10,920 క్యూసెక్కులు కొల్లేరుకు వస్తుందని అంచనా. వీటిలో కేవలం 12 వేల క్యూసె క్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా 62 కిలోమీటర్ల ప్రయాణించి బంగాళాఖాతం చేరుతుంది.
ఏలూరు జిల్లాలోని కై కలూరు, మండవల్లి, పెదపాడు, ఏలూరు, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో విస్తరించిన కొల్లేరులో 71 గ్రామాలు, కొల్లేరు అనుబంధ గ్రామాలు 150 కలిపి మొత్తం 227 గ్రామాలు ఉన్నాయి. కొల్లేరుకు చేరే నీటిని దిగువకు పంపించే మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన ఖానాల వద్ద గుర్రపుడెక్క భారీగా పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహం మందగించి సమీప పెనుమాకలంక గ్రామానికి చేరే రోడ్డుపై నుంచి నీరు పారుతోంది. దీంతో రాకపోకాలు బంద్ చేశారు. ప్రజలు పడవలపై గ్రామాలకు చేరుతున్నారు.
కమిటీలు సూచించినా కదలిక : వరదల సమయంలో కొల్లేరుకు వచ్చే నీటితో లాభాల కంటే నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయని 1895లో అప్పటి ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. తమ్మిలేరు, బుడమేరుల వల్ల జరుగుతున్న పంట నష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యని ప్రతిపాదించారు. 1964 వరదల తర్వాత మిత్ర కమిటీ కూడా ఇవే ప్రతిపాదనలు చేసింది. వరదల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు వచ్చే నీరు 47 టీఎంసీలకు పైనే ఉంటుందని, రిజర్వాయర్ల నిర్మాణం జరిగితే డెల్టాలో మరో 5 లక్షల ఎకరాల సాగులోనికి తీసుకురావడానికి ఈ నీరు పనికొస్తుందని సూచించారు.
అటకెక్కిన కొల్లేరు చానలైజేషన్
తొలిదశలో కొల్లేరులో నీటిమట్టం 7 అడుగులు ఉంటే 15 వేల క్యూసెక్కుల నీరు అవుట్‌ప్లో ఉండేలా ఉప్పుటేరుని ఆధునికరించాలని కమిటీ సూచించింది. రెండో దశలో కొల్లేటి నీటిమట్టం 7 అడుగులు ఉంటే 20 వేల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో ఉండేలా పనులు చేపట్టాలని పేర్కొంది. రెండు దశల పనులకు దాదాపు రూ.7 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేశారు. నిధులు కొరత, కొల్లేరు చుట్టూ ఆక్రమణలు ఇలా రకరకాల కారణాలతో 1981 వరకు పనులు ప్రారంభం కాలేదు. తర్వాత ప్రభుత్వం ప్రకటించిన రూ.40 కోట్లు ఏమాత్రం సరిపోవని తేల్చారు. కొన్ని సంవత్సరాల క్రితం డ్రెడ్జింగ్ పనులు తూతూ మంత్రంగా జరిగాయి.
కలగా మారిన డ్రెయిన్ల మరమ్మతులు
ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు
రెగ్యులేటర్ల నిర్మాణంతోనే సమస్యకు చెక్

కొల్లేరు ప్రక్షాళన ప్రశ్నార్థకం

కొల్లేరు ప్రక్షాళన ప్రశ్నార్థకం

కొల్లేరు ప్రక్షాళన ప్రశ్నార్థకం