
జ్వరాల విజృంభణ
కాళ్ల మండలం బొండాడపేటకు చెందిన కె.లక్ష్మణరావుకు జ్వరం రావడంతో మూడు రోజులు ఇంటి వద్దే ఉన్నాడు. అప్పటికీ తగ్గకపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రిలో చేరి మూడు రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు.
భీమవరానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఆరు రోజులుగా జ్వరంతో బాధపడుతూ భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు.
భీమవరానికి చెందిన ఎండీ నిషార్ అనే వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధపడి భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటి వద్ద రెండు, మూడు రోజులపాటు జ్వరంతో బాధపడిన తర్వాత ఆస్పత్రిలో చేరాడు.
ఇలా జిల్లావ్యాప్తంగా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి.
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో వాతావరణంలో మార్పులు, క్షీణించిన పారిశుద్ధ్యం, దోమల బెడదతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజులపాటు ఎండ వేడిమి, మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలు వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా వైరల్, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో 409 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామంలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. జ్వరం వచ్చి రెండు, మూడు రోజులపాటు తగ్గకపోవడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా పట్టణాల్లో ఆస్పత్రుల్లో రోజుకు 20 వరకు జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ప్లేట్‌లెట్స్ తగ్గి ఆస్పత్రుల్లో చేరుతున్న వారు ఉంటున్నారు.
సుమారు 1,500 కేసులు
ఆగస్టు నెల ప్రారంభం నుంచి జ్వరపీడితులు పెరుగుతున్నారు. జిల్లాలో ఈనెల 11 నుంచి 17 వరకు 19 టైఫాయిడ్, ఒక డెంగీ కేసు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో పది రోజుల్లో సుమారు 1,500కు పైగా జ్వరాలు కేసులు నమోదయినట్టు అంచనా. వైద్యారోగ్య శాఖ అధికారులు రక్తనమూనాలు సేకరించిన వారి వివరాలు మాత్రమే లెక్కల్లో చూపిస్తున్నారు. అయితే వాస్తవంగా జ్వరాల కేసులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
అరకొర సేవలు
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జ్వరపీడితులకు అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. జనరల్ మెడిసిన్, ఎండీ స్థాయి వైద్యుల కొరత ఉంది. అలాగే సరైన రక్తపరీక్ష ల్యాబ్‌లు లేకపోవడం, ఉన్న ల్యాబ్‌లో సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు.
వాతావరణంలో మార్పులతో వ్యాధులు
వైరల్, టైఫాయిడ్ బారిన ప్రజలు
అధ్వానంగా పారిశుద్ధ్యం
దోమల నివారణ చర్యలు శూన్యం
1,500కు పైగా కేసుల నమోదు
దోమల నివారణకు చర్యలు లేవు
జిల్లాలో వైరల్, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం కనీసం బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. పలుచోట్ల డ్రెయినేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్డు మార్జిన్లు చెత్తతో నిండిపోతున్నాయి. వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జ్వరాల కేసుల వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదని పలువురు అంటున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు లెక్కల్లో తక్కువ జ్వరాల కేసులు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జ్వరాలపై సరైన సర్వే జరగడం లేదని తెలుస్తోంది.