
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం
భీమవరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని, పేద విద్యార్థులు సక్ర మంగా చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అరిగేల అభిషేక్ ధ్వజమెత్తారు. విద్యావ్యవస్థలో ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం భీమవరం అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన తెలిపారు. అభిషేక్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు పథకంతో సర్కారీ బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారని, పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారన్నా రు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పాఠశాలను అభివృద్ధి చేయకపోగా.. పాఠశాలలు, హాస్టళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయన్నారు.
సమస్యల తాండవం
జిల్లా ఉపాధ్యక్షుడు తమనంపూడి సూర్యరెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ గంటా రాహుల్ మాట్లాడుతూ ఇటీవల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి అక్కడి సమస్యలను కలెక్టర్ నాగరాణి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లలోని అవకతవకలు, ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకువస్తుండటంతో విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు విద్యాసంస్థలు, హాస్టళ్లలోకి వెళ్లకూడదని మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమన్నారు. ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తోందన్నారు. జిల్లా జాయింట్ సెక్రటరీ నేకూరి గణేష్, తాడేపల్లిగూడెం రూరల్ ప్రెసిడెంట్ తాడిపల్లి అనిల్ కుమార్, తాడేపల్లిగూడెం రూరల్ ఉపాధ్యక్షుడు జాలపర్తి సురేష్, సెక్రటరీ కొండపల్లి శివనాగ ఉదయ్ భాస్కర్, తణుకు నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ పాల్, మేడిది జూన్సన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నిరసన