
కూల్చివేతను అడ్డుకున్న దళితులు
ఉండి: ఉండి మండలం వాండ్రం దళితపేట డ్రెయిన్‌ను ఆనుకుని వున్న 30 ఇళ్లను కూల్చేందుకు పొక్లెయిన్‌ను తీసుకు రాగా దళితులు అడ్డుకున్నారు. గతంలో అక్కడ అధికారులు కొలతలు వేసి.. డ్రెయిన్ కొలతలు మీ ఇళ్ళల్లోకి వచ్చేశాయి ఇళ్ళు పడగొట్టాలని మార్కింగ్ చేసి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై గొడవ నడుస్తోంది. కొందరు దళితులు సోమవారం కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందించి వచ్చిన కొద్దిసేపటికే కొందరు పొక్లెయిన్‌తో దళితపేటకు చేరుకున్నారు. దీంతో దళితులు అధికారులకు ఫోన్‌లు చేశారు. మాకెలాంటి సంబంధం లేదు, మేం పొక్లెయిన్ పంపించలేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో దళితులు ఆందోళనకు సిద్ధపడ్డారు. ఈ పరిణామాలను గమనించిన అధికారులు వెంటనే ఆ ప్రాంతం నుంచి పొక్లెయిన్‌ను పంపించివేయడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇళ్ల పడగొట్టి రోడ్డు వేస్తాం అని ఎవరైనా వస్తే దానికి తగిన విధంగా సమాధానమిస్తామంటూ దళితులు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో వాండ్రం దళితపేటకు ఆనుకుని మురుగుబోదె లేనే లేదని అంటున్నారు. ఇప్పుడు బోదెకు కొలతలు, దళితుల ఇళ్ళపై మార్కింగ్‌లు ఎక్కడ నుంచి వచ్చాయని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని మంచినీటి చెరువుకు సంబంధించిన మురుగు బయటకు పోయేలా సమీపంలోని కొందరు రైతుల విన్నపంతో చిన్న బోదెను ఏర్పాటు చేశారని తెలిపారు. కాలక్రమేణా అది పెద్దబోదెగా మారిందన్నారు. రైతుల కోసం తాము బోదె తవ్వకానికి ముందడుగు వేశామని, ఇప్పుడు ఇళ్లు పడగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు. అధికారులు న్యాయం చేయకపోతే తామంతా పోరుబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనాల రాజేంద్రకుమార్, కోనాల జీవన్‌కుమార్, ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్తి రాజ్‌కుమార్, దీన రాజు, పాము మధు, తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినవారిలో ఉన్నారు.