చెరుకువాడలో ఆగని మట్టి రవాణా
ఉండి: చెరుకువాడలో మట్టి అక్రమ రవాణా ఆగడం లేదు. మాకు అడ్డు చెప్పేది ఎవరు.. మమ్మల్ని ఆపేది ఎవరు అన్నట్టుంది ఇక్కడి వ్యవహారం. ఒకవేళ గ్రామస్థాయి అధికారులు అడ్డుకుంటున్నా వారిపై మండలస్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తుండడంతో మట్టి అక్రమ రవాణాను ఆపడం సాధ్యం కావడం లేదు. మట్టి యథేచ్ఛగా తరలిస్తుండడంతో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా ఉన్నత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. శుక్రవారం చెరుకువాడ శివారు అర్తమూరు రోడ్డులో డంపింగ్ చేసి భధ్రపరచుకున్న మట్టిని పెద్ద ఎత్తున ట్రాక్టర్‌లతో రవాణా చేశారు. దీనిపై ప్రజల ఫిర్యాదుతో క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన గ్రామాధికారి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కారణం ఒకవైపు ప్రజలు, మరోవైపు మండలాధికారుల సహకారం లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న చెరుకువాడ మీదుగా పెద్ద ఎత్తున వెళుతున్న మట్టి ట్రాక్టర్‌లను స్థానికులు అడ్డుకుని అధికారులు వచ్చి సమాధానం చెబితేనే గాని వదిలిపెట్టమంటూ పట్టుబట్టారు. దీంతో ఆ ఒక్కరోజు మాత్రమే మట్టి రవాణా ను అడ్డుకున్న అధికారులు ఆ తరువాత నుంచి పట్టించుకోలేదు. దీంతో మట్టి అక్రమ రవాణాదారుల నుంచి ఉన్నత అధికారులకు ఏ స్థాయిలో తాయిలాలు అందుతున్నాయో అంటూ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలు మళ్లీ మట్టి ట్రాక్టర్‌లను అడ్డుకునేందుకు సమాయత్తం కాగా అధికారులు వాటిని నిలుపుదల చేశామని చెప్పారు.


