పేదల ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గం
ఆకివీడు: కొందరి ప్రయోజనం కోసం పేదల ఇళ్లు పీకివేయడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ ధ్వజమెత్తారు. మండలంలోని కోళ్లపర్రు బ్రిడ్జిపేట వాసులకు ఇళ్లు తొలగింపు నోటీసుల్విడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా, రెండుమూడు తరాలవారు నివసిస్తున్న పేదల ఇళ్లను తొగించడం కక్ష సాధింపు చర్యలన్నారు. నాడు పట్టాలిచ్చి, నేడు చంద్రబాబు ప్రభుత్వమే తొలగించడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి పేదల ఇళ్లు తప్ప, ధనికుల ఆక్రమణలు, భవనాల నిర్మాణం కన్పించడంలేదని ఆరోపించారు. బ్రిడ్జిపేట వాసులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని గోపాలన్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం ఏరియా కార్యదర్శి తవిటినాయుడు, సాకా కిసింజర్, బాధిత మహిళలు పాల్గొన్నారు.


