ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల నిరసన
నూజివీడు: వేతనాలను పెంచాలని కోరుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంగళవారం వారు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలలో చదువుకుని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 2010–14 సంవత్సరాల మధ్య కాలంలో ట్రిపుల్ ఐటీలో చేరామని, అయితే తమకు వేతనాలను పెంచి ఎనిమిదేళ్లయిందన్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారని వాపోయారు. గతంలో ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం ద్వారా సంస్థాగత స్థాయిలోనే నేరుగా అధ్యాపకుల జీతాలను పెంచేవారని, ప్రస్తుతం జీతాల పెంపు విషయాన్ని ఉన్నత విద్యాశాఖ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఉన్నత విద్యా శాఖ లేవనెత్తిన పలు అంశాలకు సంబంధించి ట్రిపుల్ ఐటీ అధికారులు రెండు నెలలుగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనకు దిగామన్నారు. అనంతరం డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.


