మొక్కుబడిగా ఇంధన పొదుపు వారోత్సవాలు
వారోత్సవాల సమాచారం లేదు
● జిల్లాలో కానరాని అవగాహన కార్యక్రమాలు
● వారోత్సవాల బడ్జెట్.. మోంథా ఖర్చులు రాక నీరసం
తణుకు అర్బన్: విద్యుత్ శాఖ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు చంద్రబాబు సర్కారులో మొక్కుబడిగా నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు పొదుపు వారోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా ఎటువంటి అలికిడి లేకుండానే గడిచిపోయాయని అంటున్నారు. వారోత్సవాల కోసం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. మొత్తానికి సర్కారు పర్యవేక్షణ లోపమో, విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ జిల్లాలోని కొన్ని విద్యుత్ సబ్ డివిజన్‌లలో వారోత్సవాలు అరకొరగాను, మొక్కుబడిగాను నిర్వహించారని, వినియోగదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ప్రజానీకం ఆరోపిస్తున్నారు.
గతంలో అట్టహాసంగా..
గత ప్రభుత్వ హయాంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. వారోత్సవ నిర్వహణలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు వారంరోజుల పాటు సబ్ డివిజన్ కార్యాలయాల్లో వివిధ కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంధన పొదుపుతోపాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేవారు. ఇంధనం పొదుపు చేద్దాం.. భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ విలువైనది.. వృథా కాకుండా ఆదా చేద్దాం. మూడు లేక అంతకన్నా ఎక్కువ స్టార్లు ఉన్న గృహోపకరణాలు వాడుదాం.. 30 శాతానికిపైగా విద్యుత్ బిల్లు ఆదా చేద్దాం అంటూ వినియోగదారులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ ఏడాది ఎక్కడా అవగాహన కార్యక్రమాలు కానరాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బడ్జెట్ అందకపోవడమే కారణమా?
జాతీయ ఇంధన వారోత్సవాల నిర్వహణకు జిల్లాకు కొంత మొత్తం బడ్జెట్‌ను కేటాయిస్తుంటారు. జిల్లాకు సుమారుగా రూ.లక్ష నిధులు కేటాయింపులు చేసి ఆయా సబ్ డివిజన్ కార్యాలయాలకు కొంత మొత్తం చొప్పున అందించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఇంకా సదరు బడ్జెట్ నిధులు అందకపోవడంతో కొన్ని సబ్ డివిజన్‌లలో తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులిపేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మోంథా తుపాను కారణంగా విద్యుత్ శాఖ నిర్వహించిన పనులకు గాను ఆయా సబ్ డివిజన్‌లకు చేసిన ఖర్చుల తాలూకా నిధులు అందలేదని దీంతో విద్యుత్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారోత్సవాల విషయంమై తాడేపల్లిగూడెం విద్యుత్ డివిజనల్ ఇంజనీరు కె.నరసింహమూర్తిని ‘సాక్షి’ వివరణ కోరగా తాడేపల్లిగూడెం డివిజన్ అంతా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించామని చెప్పారు. అయితే బడ్జెట్ ఇంకా రావాల్సి ఉందని చెప్పారు.
ఇంధన పొదుపు వారోత్సవాల పేరుతో గతంలో విద్యుత్ వాడకం, పొదుపుపై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించే వారు. కానీ ఈ ఏడాది వారోత్సవాలపై వినియోగదారులకు సమాచారం లేదు. అసలు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించినట్లు కనిపించలేదు.
– పి.సాయిసూర్య, వినియోగదారుడు, తణుకు


