విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
● మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న కారు
● భార్యాభర్తలు మృతి
కంకిపాడు: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కంకిపాడులో మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన పాలెపు వెంకన్న (45), తన భార్య గృహలక్ష్మితో కలిసి మోటరుసైకిల్‌పై పరిటాలలో ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు ఈ నెల 21న బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి మోటార్‌సైకిల్‌ను కంకిపాడు నుంచి గుడివాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పాలెపు వెంకన్న విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న వెంకన్న భార్య గృహలక్ష్మిని వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శివ సహస్ర నామ పూజలు
పాలకొల్లు సెంట్రల్: స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవార ప్రదక్షిణల్లో భాగంగా ఏడు సోమవారాలు ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు మంగళవారం శివసహస్రనామ పూజలు జరుపుకున్నారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించుకుని మండపంలో ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమాల్లో 12 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న బ్రహ్మత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు కిష్టప్ప, అనిల్, వీరబాబు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో చినవెంకన్న తిరువీధి సేవ మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, గోదాదేవితో కలసి స్వామివారు ఉదయం క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు విశేష పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
విషాదం నింపిన రోడ్డు ప్రమాదం


