
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 13తో అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ ఈ నెల చివరి వరకు భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కావడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అమ్మను దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలు సమర్పించారు. జాతరకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. దేవస్థానంలో శ్రీక్యూశ్రీ లైన్లు నిండాయి. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, చిత్రపటాల అమ్మకం, అమ్మవారికి కానుకల ద్వారా రూ.2,92,056 ఆదాయం వచ్చిందని తెలిపారు.
అంబేడ్కర్‌ను అవమానించిన వారిని శిక్షించాలి
గణపవరం: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గణపవరం మండలం పిప్పరలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలు మేధావిగా కొనియాడిన బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. పేద, దళిత, నిమ్న జాతుల గుండెల్లో కొలువైఉన్న అంబేడ్కర్‌ను ఎవరు అవమానించినా సహించేదిలేదన్నారు. దళితుల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టి వారి మధ్య విభేదాలు సృష్టించడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు చోడదాసి జైపాల్, సబ్బితిరాజు, నీతిపూడి వెంకటేశ్వర్లు, ప్రసన్నకుమార్, వెన్నపుచంటి, బీర త్రిమూర్తులు, సారధి, మోహనరావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ