ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించలేపోతున్నారు. మరో వైపు కూటమి నేతల సాయంతో బెల్టు షాపుల ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 2025 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు అక్రమ అమ్మకాలపై ఏకంగా 899 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 144 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై భారీగా కేసులు నమోదయ్యాయి. 315 ఐడీ కేసుల్లో 324 మంది, 157 బెల్లపు ఊట కేసుల్లో 44 మంది, 345 బెల్టు షాపులపై కేసుల్లో 348 మంది, 50 ఎన్‌డీపీఎల్ కేసుల్లో 51 మంది, 28 ఇతర కేసుల్లో 28 మందిపై కేసులు నమోదు చేశారు. 42 వాహనాలను ఎకై ్సజ్ పోలీసులు సీజ్ చేశారు.
ఏడు ఎకై ్సజ్ సర్కిళ్లలో ఇలా..
జిల్లాలోని ఏడు సర్కిళ్ల పరిధిలో భీమడోలు, ఏలూరు సర్కిళ్లలో తక్కువ కేసులు నమోదయ్యాయి. చింతలపూడి సర్కిల్‌లో 256 కేసులు నమోదు చేశారు. నూజివీడు సర్కిల్‌లో 203 కేసులు, జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో 124 కేసులు, పోలవరం 121, కై కలూరు సర్కిల్లో 77 కేసులు నమోదు చేశారు. బెల్టుషాపుల విషయానికొస్తే కై కలూరులో 70, నూజివీడు 50, చింతలపూడి సర్కిల్ పరిధిలో 52 కేసులు నమోదు చేశారు. బెల్లపుఊటకు సంబంధించి చింతలపూడిలో 52 కేసుల్లో 59 వేల లీటర్లు ధ్వంసం చేయగా.. పోలవరం సర్కిల్‌లో 47,800 లీటర్లు, నూజివీడు సర్కిల్‌లో 45,310 లీటర్లు, జంగారెడ్డిగూడెం సర్కిల్‌లో 15,320 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం చేశారు. చింతలపూడి పరిధిలో 15 వాహనాలు, నూజివీడులో 16 వాహనాలు, పోలవరం 6, జంగారెడ్డిగూడెం 4, ఏలూరులో ఒక్క వాహనాన్ని సీజ్ చేశారు.
నిబంధనలు పాటించాలి
అక్రమంగా మద్యం విక్రయించినా.. నిబంధనలు పాటించకపోయినా కేసులు నమోదు చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో సారా తయారీపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నాం. మూడు నెలల్లో భారీగా కేసులు నమోదు చేశాం.
– ఆవులయ్య, ఎకై ్సజ్ అధికారి, ఏలూరు
899 కేసుల్లో 799 మంది అరెస్ట్
బెల్టు షాపులపై 345 కేసులు
ఏరులై పారుతున్న మద్యం