తిరువీధుల్లో శ్రీవారి శోభ
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం క్షేత్ర పురవీధుల్లో శ్రీవారికి జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటడంతో పాటు, భక్తులకు కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. గుడి సెంటర్‌లోని ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని రాత్రి సైతం స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది.
ఏలూరు (టూటౌన్): చెక్‌బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తీర్పును వెలువరించారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఏలూరుకు చెందిన మేడపాటి సుధాకర్ వద్ద నుంచి నగరానికి చెందిన ఆవుల అనిత 2023 ఫిబ్రవరి 18న రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తిరిగి చెల్లించే నిమిత్తం 2024, ఏప్రిల్ 18న రూ.7.50లక్షల చెక్కును ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా చెల్లుబాటు కాలేదు. దీంతో ఆయన 2025లో కేసు వేశారు. విచారణ అనంతరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో సదరు మహిళపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.7.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాది దారుని తరుఫున న్యాయవాది చిక్కా భీమేశ్వరరావు తన వాదనలను కోర్టులో వినిపించారు.


