15వ రోజుకు ధర్మ పోరాట దీక్ష
నూజివీడు: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నూజివీడు ట్రిపుల్ ఐటీలోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష బుధవారం నాటికి 15వ రోజుకు చేరింది. క్యాంపస్‌లోని ఐ3 భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన టెంట్‌లో దీక్ష నిర్వహిస్తున్నారు. వీరందరూ టైంటేబుల్ ప్రకారం విద్యార్థులకు పాఠాలు బోధించి తదనంతరం పోరాట దీక్షలో కూర్చుంటున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడేళ్లకు పైగా తమకు వేతనాలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని, దీనిపై తాము గత 15రోజులుగా పోరాడుతున్నా ఆర్జీయూకేటీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూజీసీ ప్రకారం వేతనాలు ఇస్తామని చెప్పి, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ సుబ్బారావు, రచన గోస్వామి, పీవీ లక్ష్మణరావు, జాడ సీతాపతిరావు, లంకపల్లి రాజేష్, భవాని, ఉదయశ్రీ, దీప్తీ సాహూ తదితరులు పాల్గొన్నారు.


