
రైతులకు మెరుగైన సేవలందించాలి
ఏలూరు(మెట్రో): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలందించాలని జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రత్యేక అధికారి పి.ధాత్రిరెడ్డి అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జేసీ, డీసీసీబీ ప్రత్యేక అధికారి ధాత్రిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లోగా పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్‌లో వ్యాపార కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలన్నారు. నిరర్ధక రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రుణాల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. రుణాలను సక్రమంగా చెల్లించే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని, వారికి వడ్డీలో కొంత మొత్తం రాయితీపై రుణాలను అందిస్తామన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రాబడి, వ్యయాలను ఆమోదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా సభలో ఆమోదించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖాధికారి ఏ.శ్రీనివాస్, డీసీసీబీ సీఈఓ సింహాచలం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు, సహకార శాఖ పర్సన్ ఇన్‌చార్జ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.