దెందులూరు: భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దెందులూరు మండలంలోని సీతంపేట రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్ నుంచి మూడో బోగీ చక్రాల వద్ద మంటలు వ్యాపించాయి. దీనిని గుర్తించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి మంటలను ఆర్పేశారు. అనంతరం రైలు యథావిధిగా ముందుకు సాగిపోయింది. ఈ ఘటనపై రైల్వే ఎస్సై సైమన్ మాట్లాడుతూ వేసవిలో ఇలా జరగటం సర్వసాధారణమని చెప్పారు. అధిక ఎండల వల్ల బ్రేక్ షూస్‌లో స్వల్ప మరమ్మతులు వచ్చే అవకాశముందని తెలిపారు.
స్మార్ట్ గ్రిడ్‌తో నాణ్యమైన విద్యుత్
తాడేపల్లిగూడెం: స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, నష్టాలను కొంతవరకు తగ్గించవచ్చని వరంగల్ నిట్ ఆచార్యులు డాక్టర్ డి.శ్రీనివాసరావు అన్నారు. ఏపీ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో పవర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ఇన్ స్మార్ట్‌గ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే అంశంపై ఐదు రోజుల పాటు జరుగనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంటు ప్రోగ్రాం సోమవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తుందన్నారు. పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఉండే వివిధ రకాల స్విచ్‌లు, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఏపి నిట్ డీన్ అకడమిక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతులు పాల్గొన్నారు.
కారు ఢీకొని ముగ్గురికి గాయాలు
భీమవరం: భీమవరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారని టూటౌన్ ఎస్సై రెహమాన్ చెప్పారు. పట్టణంలోని 32వ వార్డుకు చెందిన ఎం.బేబిపవన్, భార్య లక్ష్మి, మరో వ్యక్తి మోటారు సైకిల్‌పై పెదఅమిరం వెళుతుండగా అడ్డవంతెన వద్ద వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రెహమాన్ చెప్పారు.
బాలిక ఆదృశ్యం.
టూటౌన్ పరిధిలోని రాయలం పంచాయతీ ఉప్పుగుంటకు చెందిన బాలిక ఆదివారం తెల్లవారుజామున అదృశ్యమైనట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రెహమాన్ చెప్పారు.
ముగిసిన నాటిక పోటీలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాటిక పోటీలు సోమవారం ముగిశాయి. చివరి రోజు చిగురు మేఘం, పక్కింటి మొగుడు, అనూహ్యం నాటికలు ఆకట్టుకున్నాయి. కళాపరిషత్ సభ్యులు కెవీ కృష్ణవర్మ, మానాపురం సత్యనారాయణ, మేడికొండ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గడచిన 18 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.1,75,65,133 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. భక్తులు కానుకల రూపేణా సమర్పించిన 137 గ్రాముల బంగారం, 3.130 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో రూ.17,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.