
నడిరోడ్డుపై మొరాయింపు
ఉండి: ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయి. నడిరోడ్డుపై మొరాయించడంతో ప్రయాణికులు మండుటెండలో లబోదిబోమంటున్నారు. భీమవరం డిపోకు చెందిన తాడేపల్లిగూడెం వెళ్లే బస్సు కోలమూరు సెంటర్‌కు వచ్చేసరికి ఆగిపోయింది. ఆ ఎండలో ప్రయాణికుల వెతలు వర్ణనాతీతం. మరో బస్సులో ప్రయాణికులు వెళ్లాల్సి వచ్చింది.
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
భీమవరం: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 52 కేంద్రాల్లో ఈ నెల 1న పరీక్షలు ప్రారంభం కాగా ఎక్కడా మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. శనివారం నిర్వహించిన కెమిస్ట్రీ, కామర్స్ జనరల్ పరీక్షకు 15,006 మందికి 14,584 మంది హాజరుకాగా, ఒకేషనల్ పరీక్షకు 927 మంది విద్యార్థులకు 778 మంది హాజరైనట్లు డీఐఈవో ఎ.నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఒకేషనల్, 19, 20 తేదీల్లో హెచ్‌ఈసీ పరీక్షలు నిర్వహించాల్సివుంది. ప్రధాన పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఆనందంగా ఇంటి ముఖం పట్టారు. రెండేళ్ల పాటు కలసిమెలసి చదివిన స్నేహితులు ఈ రోజు నుంచి దూరం కానుండడంతో కొంతమంది విద్యార్థులు భావోగ్వేదానికి గురయ్యారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని బై బై చెప్పుకుంటూ ప్రయాణమయ్యారు. 15 రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో విద్యాశాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వైఎన్ కళాశాల
అటానమస్ పొడిగింపు
నరసాపురం: నరసాపురం వైఎన్ కళాశాల అటానమస్ స్టేటస్‌ను 2035 వరకూ పాటు పొడిగిస్తూ యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది కళాశాల నాలుగోసారి నాక్ గుర్తింపు సాధించింది. దీంతో ఈ ఏడాది ఎలాంటి పరిశీలన లేకుండా 10 ఏళ్ల పాటు అటానమస్ స్టేటస్ పెంచారని కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ చెప్పారు. కళాశాల అభ్యున్నతికి ఇది మరింత దోహదం చేస్తుందని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ అందే రామసతీష్ అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గోపి
ఏలూరు (టూటౌన్): జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా లక్కోజు రాజగోపాలాచారిని(గోపి) నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్ నియామక పత్రాన్ని గోపికి అందజేశారు. స్థానిక పవర్ పేట వడ్రంగి సంక్షేమ సంఘం భవనంలో శనివారం జరిగిన జిల్లా బీసీ సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా రాజగోపాలాచారిని, మహిళా కార్యదర్శిగా బాలిన ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శిగా చిదరబోయిన శ్రీనివాస్ యాదవ్, నగర యూత్ అధ్యక్షుడిగా జరజాపు రాఘవ, యూత్ కార్యదర్శిగా ఇదలాడ నాని, బంకురి వెంకట్, బీసీ మహిళ అధ్యక్షురాలిగా మోతిక రాఘవమ్మ, జిల్లా కమిటీ సభ్యులుగా బాయి వెంకట్రావు, కింజంగి రాజు, కొత్తల శివ, కెల్ల దుర్గాప్రసాద్, చిట్టు మోజు రత్నబాబు, కొండల ప్రసాద్ తదితరులను నాయకులును నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.

నడిరోడ్డుపై మొరాయింపు

నడిరోడ్డుపై మొరాయింపు

నడిరోడ్డుపై మొరాయింపు