మాధవాయిపాలెం ఫెర్రీపై వివాదం | - | Sakshi
Sakshi News home page

మాధవాయిపాలెం ఫెర్రీపై వివాదం

Mar 12 2026 7:09 AM | Updated on Mar 12 2026 7:09 AM

మాధవాయిపాలెం ఫెర్రీపై వివాదం బంగారం వ్యాపారిపై కేసు నమోదు

నరసాపురం రూరల్‌: మాధవాయిపాలెం ఫెర్రీకి సంబంధించి దరఖాస్తుల తిరస్కరణపై వివాదం నెలకొంది. ఈనెల 12న ఫెర్రీ రేవు టోల్స్‌ వసూలుకు సంబంధించి వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది. వేలం ప్రక్రియకు నలుగురు దరఖాస్తు చేసుకోగా అందులో ఇద్దరి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో దరఖాస్తులు తిరస్కరించబడ్డ భూపతి కిరణ్‌, పప్పుల బ్రహ్మాజీ బుధవారం సాయంత్రం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఇతర పాటదారులతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని, తమ దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారని ఆరోపించారు. ఈ ఆందోళన రాత్రి వరకూ కొనసాగింది. ఎంపీడీవో కార్యాలయం చుట్టూ భారీగా జనం చేరడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై ఎంపీడీవో నాసరు రెడ్డిని వివరణ కోరగా వేలం పాటకు సంబంధించి నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పారు. వేలంకు నలుగురు దరఖాస్తు చేసుకున్నారని, రెండు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్నారు.

తణుకు అర్బన్‌: బంగారు వస్తువులు తయారు చేయించి ఇస్తానని మహిళలను మోసం చేసి వారి వద్ద బంగారం, నగదు తీసుకుని ఉడాయించిన బంగారం వ్యాపారిపై తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తణుకులోని శ్రీ సాయిదుర్గ గోల్డ్‌ కాస్టింగ్‌ వర్క్స్‌ పేరుతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శిసిర్‌ బేగ్‌ పలువురు మహిళల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారు. నాలుగు నెలలుగా వారిని తిప్పుకుంటూ చివరికి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తాడేపల్లిగూడెంనకు చెందిన దున్నా బేబి, పైడిపర్రుకు చెందిన తానేటి మధుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement