న్యూస్‌రీల్
ప్రగతికి పెద్దపీట
ఆనారోగ్యం వచ్చిందంటే ఆరోగ్యశ్రీ ఉందన్న ధైర్యం... పిల్లల చదువులకు అమ్మఒడి, విద్య, వసతి దీవెనలు ఉన్నాయన్న ధీమా. అక్కచెల్లెమ్మలకు ఆసరాగా, అగ్రవర్ణాల పేద మహిళలకు నేస్తంగా, సాగులో రైతుకు, వేట విరామంలో మత్స్యకారులకు భరోసాగా, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీ.. కులమత వర్గాలు, రాజకీయాలు చూడకుండా సంక్షేమ లబ్ధిని వారి చెంతకు చేర్చింది. నేడు వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అంతటా వేడుకల నిర్వహణకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
● సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో గడప చెంతకు చేరిన సంక్షేమ లబ్ధి
● ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌తో పేదల వైద్యానికి పెద్దపీట
● నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ
● నవరత్నాలతో పేదల ఉన్నతికి బాటలు
● నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
● జిల్లా అంతటా వేడుకలకు పార్టీ శ్రేణులు సన్నాహాలు
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
డాక్టర్ కావాలన్న నా కల నెరవేరుతోందంటే జగనన్న చలవే. రాష్ట్రవ్యాప్తంగా ఆయన తెచ్చిన మెడికల్ కళాశాలల్లో ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు వైద్యవిద్యను అభ్యసించగలుగుతున్నారు. నాకు మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. రెండేళ్లు పూర్తిచేసుకుని థర్డ్ ఇయర్ చదువుతున్నాను. పేదలకు మంచి వైద్యాన్ని అందించాలన్నదే నా సంకల్పం.
– ఎన్. సాయిసింధూజ, వైద్యవిద్యార్థిని,
కొంతేరు, యలమంచిలి మండలం
గీత కార్మికుడినైన నాకు రెండేళ్ల క్రితం ఆనారోగ్యం చేసినప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారు. నా కుమారుడు, కుమార్తె ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయంతో చదువుకున్నారు. కుమారుడు ప్రస్తుతం లండన్‌లో ఎంఎస్ చేస్తుండగా, కుమార్తె చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తోంది. మా కుటుంబానికి జగన్ ప్రభుత్వం చేసిన మేలును మరువలేం.
– గుబ్బల శ్రీనివాస్, యర్రంశెట్టిపాలెం
జగనన్న ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మా గ్రూపు సభ్యులు తీసుకున్న రుణం ఆసరా పథకం కింద రూ.10 లక్షలు మాఫీ చేయడంతో ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష మేర లబ్ధి చేకూరింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని పథకాలు అమలుచేశారు.
– కె.దుర్గ, డ్వాక్రా సభ్యురాలు, మోగల్లు
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా పార్టీశ్రేణులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్‌లు చేసి సేవా కార్యక్రమాలు చేయనున్నారు.
సాక్షి, భీమవరం : పేదల గుండెచప్పుడుగా, జన సంక్షేమమే అజెండాగా జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీని స్థాపించారు. 2019 మే 30న సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాల అమలుకు అడుగులు వేశారు. ఐదేళ్ల ప్రగతిని పరవళ్లు తొక్కించారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు తెచ్చి సంక్షేమ పథకాలను పేదల చెంతకు చేర్చారు. పింఛన్ కోసం వృద్ధుల పడిగాపులకు చెక్ పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల కోసం వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, డ్రైవర్ల కోసం వాహనమిత్ర, మత్య్సకారులకు మత్య్సకార భరోసా, చేనేత కార్మికుల కోసం నేతన్న నేస్తం తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఉమ్మడి జిల్లాలోని పేదలకు సుమారు రూ.2,500 కోట్ల లబ్ధి చేకూర్చారు.
● రైతుల కోసం ఉచిత పంటల బీమాను అమలుచేశారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సరఫరా చేశారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా జిల్లాలోని రైతులకు రూ.796.49 కోట్ల సాయం అందించారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని లక్షల మందికి సర్వీస్ చార్జీ లేకుండానే కుల ధ్రువీకరణ, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.
● రూ. 369.13 కోట్లు నాడు నేడు నిధులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా డిజిటల్ విద్యాబోధన చేపట్టింది. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేసింది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్ల సాయం అందించింది.
● ఆరోగ్యశ్రీ ద్వారా ఐదేళ్లలో 2,05,785 మందికి రూ.436.32 కోట్ల విలువైన వైద్యసేవలతో పాటు 94,308 మందికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా రూ.53 కోట్ల సాయం అందజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంల ద్వారా స్పెషలిస్ట్ వైద్యులతో విలేజ్ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ. 25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3257కు పెంచారు.
ఉండి: మహిళా సాధికారితపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ప్రతినిధిగా ఉండి మండలం మహాదేవపట్నంకు చెందిన వనిమ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిపై మహిళలు మరింత ముందుకు సాగాలని కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలతో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఎక్కడా లేదని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గృహ వినియోగానికి అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల అవసరాలకు సరిపడా వంటగ్యాస్ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ల పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
దాదాపు రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, బల్క్ మిల్క్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. పేదవర్గాల సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలోని సుమారు 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అప్పట్లోనే 30 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. ఆక్వారంగానికి ప్రోత్సహిస్తూ నరసాపురంలో రూ.332కోట్ల వ్యయంతో ఆక్వా వర్శిటీ మంజూరు చేశారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ. 475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల పనులు చేపట్టారు. పాలకొల్లులో రూ.13.50 కోట్ల వ్యయంతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగా, నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చేపట్టారు.


