దేవాలయాలపై తీవ్ర నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

దేవాలయాలపై తీవ్ర నిర్లక్ష్యం

Mar 11 2026 9:19 AM | Updated on Mar 11 2026 9:19 AM

దేవాలయాలపై తీవ్ర నిర్లక్ష్యం టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసులో ఏసీబీ సోదాలు రిటైర్డ్‌ ఎస్సై దంపతులపై దాడి పోక్సో కేసులో యువకుడి అరెస్ట్‌

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

భీమవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలపై తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్లే అనేక ఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేత, విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. మంగళవారం భీమవరం శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో నందీశ్వరుని విగ్రహం ధ్వంసం కావడంపై ఆయన స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆలయాల్లో తోపులాటలు వంటి ఘటనలతో భక్తులు ప్రాణాలు కోల్పోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని విష్ణు అన్నారు. ద్రాక్షారామంలోని పంచారామక్షేత్రంలో ఇటీవల జరిగిన ఘటనను మరువక ముందే భీమవరంలో నందీశ్వరుని విగ్రహం ధ్వంసం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఎంతో పవిత్రమైన చంద్రపుష్కరిణి చెరువు చుట్టూ అపరిశుభ్ర వాతావరణం, మద్యం బాబులకు అడ్డాగా మారడం వంటి సంఘటనలు మునిసిపాలిటీ, దేవదాయ శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనాలన్నారు.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీల్లోని పట్టణ ప్రణాళికా విభాగంలో తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు మంగళవారం ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు కదలనివ్వకుండా రాత్రి పొద్దు పోయేంత వరకు ఈ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో అనుమతులిచ్చిన బిల్డింగ్‌ల వివరాలను సిబ్బందిని అడిగి తీసుకున్నట్లు తెలిసింది. కార్యాలయం నుంచి ఇటీవల ఇచ్చిన అనుమతులపై కూలంకుషంగా దర్యాప్తు నిర్వహించినట్లు సమాచారం. మీడియాను లోనికి అనుమతించని ఏసీబీ అధికారులు, వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.

యలమంచిలి: రాజమండ్రి దివాన్‌ చెరువుకు చెందిన రిటైర్డ్‌ ఎస్సై రామకృష్ణమూర్తి, అతని భార్య కుడుపూడి శాంతకుమారిపై గుంపర్రుకు చెందిన తుంగా నాగేశ్వరరావు దాడి చేసి కొట్టాడనే సమాచారంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. ఎస్సై తెలిపిన కథనం ప్రకారం రామకృష్ణమూర్తి తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఏఏస్సై పని చేస్తున్న సమయంలో తుంగా నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారిన తరువాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని నాగేశ్వరరావు కోరడంతో రామకృష్ణమూర్తి దఫదఫాలుగా రూ. కోటి 50 లక్షలు పెట్టుబడి పెట్టారు. అనంతరం కాలయాపన చేస్తూ డబ్బులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రామకృష్ణమూర్తి, అతని భార్య శాంతకుమారి సోమవారం గుంపర్రు వచ్చారు. నాగేశ్వరరావు ఇంట్లో లేకపోవడంతో వారు తిరిగి వెళ్తుండగా నాగేశ్వరరావు తన కారులో వచ్చి వీరి కారుకు తన కారు అడ్డు పెట్టి ఆపాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా నాగేశ్వరరావు రామకృష్ణమూర్తి, అతని భార్య శాంతకుమారిని కొట్టాడు. గాయాలు కావడంతో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు.

పాలకొల్లు సెంట్రల్‌: బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లిపోయిన కేసులో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేయగా అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని భగ్గేశ్వరానికి చెందిన బాలిక గత నెల 2న చర్చికి వెళ్లింది. అక్కడి నుంచి జీవన్‌బాబు అనే యువకుడు బలవంతంగా చర్చి నుంచి తన బైక్‌ ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేయగా సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత యువకుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement