హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దోనాడ రమేష్
తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదులు తమ వృత్తిలో నైపుణ్యం పెంచుకుని కక్షిదారులకు న్యాయం చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ దోనాడ రమేష్ సూచించారు. ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ దోనాడ రమేష్‌తో పాటు జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డిలు మంగళవారం తాడేపల్లిగూడెంలో పర్యటించారు. తొలుత నిట్ కళాశాలకు విచ్చేసిన జడ్జిలను కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మిలు ఆహ్వానించారు. కొద్దిసేపు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను జడ్జిలకు కలెక్టర్ వివరించారు. అనంతరం 11వ అదనపు జిల్లా కోర్టు, ఇతర కోర్టుల భవన సముదాయం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని, బార్ అసోసియేషన్ భవనంపై అంతస్తును జడ్జిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జిలు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం కోర్టు భవనాల సముదాయంలో సౌకర్యాలు కల్పించామని, అందుకు అనుగుణంగా న్యాయ సిబ్బంది పనిచేసి ప్రజల మనన్నలు పొందాలన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే వీలున్న కేసులను గుర్తించి కక్షిదారులకు అవగాహన కల్పించాలని, అందుకు న్యాయవాదులు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎస్.శ్రీదేవి, 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా, సీనియర్ సివిల్ జడ్జి కే.మాధవి, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి లలిత దేవి, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జి అన్నామణి, జూనియర్ సివిల్ జడ్జి ఎస్.సూర్య కిరణ్ శ్రీలు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శిరిగినీడి విజయకృష్ణ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి పెదగాడి భూపాల్ స్వాగతం పలికారు.


