పాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులు తీవ్రమైన నష్టాలతో చాలా కష్టాల్లో ఉన్నారని, ఫీడ్ ధరలు తగ్గించమని మొర పెట్టుకుంటే తగ్గించాల్సింది పోయి మరో రూ.4 ధర పెంచడం ఫీడ్ కంపెనీల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మండలంలోని పూలపల్లిలో జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా భగవాన్‌రాజు మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో యుద్ధం సాకుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాసెసింగ్ యూనిట్‌లు యుద్ధాల పేరు చెప్పి కొనుగోలు ధరలో రూ.50 తగ్గించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత మంది ఆక్వా రైతులు ఆవేదన ప్రభుత్వానికి కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మార్చి 21 లోపు రైతులకు తగిన న్యాయం చేయకపోతే తగిన రీతిలో గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు పది వేలమందితో రోడ్డు ఎక్కి తమ సమస్యపై పోరాటం ఉధృతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆక్వా సంఘం రైతులు బోణం చినబాబు, మేడిది జాన్‌రాజ్, అంగర వరప్రసాద్, యాళ్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.


