వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత స్థాయి నాటిక పోటీల 12వ వార్షికోత్సవ పోటీలు ఈనెల 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు గుండా రామకష్ణ గురువారం తెలిపారు. 13వ తేదీ రాత్రి 7 గంటలకు కృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారి– ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటిక, 14వ తేదీ రాత్రి 7 గంటలకు చైతన్య కళా స్రవంతి ఉక్కునగరం– విశాఖ వారి అగ్నిసాక్షి నాటిక, రాత్రి 8 గంటలకు క్రాంతి ఆర్ట్స్ థియేటర్– నెల్లూరు వారి ఫొటో, రాత్రి 9 గంటలకు ఎస్వీ రంగారావు కళా స్రవంతి– కాకినాడ వారి ఆచమనం నాటిక, 15వ తేదీ రాత్రి 7 గంటలకు సాయి ఆర్ట్స్– కొలకలూరు వారి జనరల్ భోగీలు నాటిక, రాత్రి 8 గంటలకు మానవతా ఎడ్లపాడు వారి అందరూ మంచివారే... కానీ ? నాటిక, రాత్రి 9 గంటలకు శ్రీ రమణ కళానిలయం– గుంటూరు వారి మాతృత్వం నాటిక, 16వ తేదీ రాత్రి 7 గంటలకు హర్ష క్రియేషన్స్ –విజయవాడ వారి చెరిగిపోని చిరునామా నాటిక ప్రదర్శించబడుతుందన్నారు. ప్రతిరోజు నాటిక ప్రదర్శనల ముందు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
నరసాపురం రూరల్, నరసాపురం: సీపీఎం నిర్వహిస్తున్న ‘ప్రజా చైతన్య పాదయాత్ర’ బృందం గురువారం సరిపల్లి పద్మశ్రీకాలనీకి చేరుకుంది. ఈ సందర్భంగా కాలనీలోని వివిధ సమస్య లతోపాటు తాగునీటి కష్టాలపై కాలనీవాసులు సీపీఎం బృందానికి వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మైళ్ల దూరం ప్రయాణించి నరసాపురం పట్టణం నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. దీంతో సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తక్షణమే కాలనీవాసుల దాహార్తిని తీర్చాలని, లేకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


