భీమవరం: భీమవరం కాస్మోపాలిటీన్ క్లబ్‌లో ఈనెల 14 నుంచి వారం రోజులపాటు ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ యూఆర్‌పీఆర్ వర్మ, క్లబ్ సహాయ కార్యదర్శి రుద్రరాజు సుబ్బరాజు తెలిపారు. గురువారం క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మెన్స్ డబుల్స్ 35+, 45+, 55+, 65+, 70 విభాగంలో సింగిల్స్, డబుల్స్, 75 + విభాగంలో డబుల్స్ టోర్నమెంట్ జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి 175 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. 14, 15 తేదిల్లో క్వాలిఫైయింగ్ పోటీలు 16 నుంచి 20వ తేదీ వరకు ముఖ్య పోటీలు జరుగుతాయని వర్మ, సుబ్బరాజు తెలిపారు. అలాగే స్థానిక క్రీడాకారుల్లో టెన్నిస్ క్రీడలో ప్రతిభను ప్రోత్సహించడానికి అండర్ –30 పురుషుల చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నామని, 8 సింగిల్స్, 4 డబుల్స్ జట్లు 18, 19, 20 తేదీల్లో పోటీల్లో పాల్గొంటాయన్నారు.
భీమవరం: ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చర్లపల్లి–కామాఖ్య అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జిల్లాలో హాల్ట్ కల్పించినట్లు కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి (తెలంగాణ) నుంచి కామాఖ్య (అస్సాం) మధ్య నడిచే నెం. 15673/15674 రైలుకు జిల్లాలోని భీమవరం టౌన్, తణుకు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు శుక్రవారం చర్లపల్లిలో ప్రారంభం అవుతుండగా తణుకులో రాత్రి 10.50 గంటలకు, భీమవరం టౌన్‌లో రాత్రి 11.30 గంటలకు చేరుకుని తిరిగి 15వ తేదీన చర్లపల్లి స్టేషన్‌కు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీస్‌గా నడుస్తుందని శ్రీనివాసవర్మ ప్రకటనలో వివరించారు.
ఏలూరు రూరల్: జాతీయస్థాయి పారా ఒలింపిక్స్ పోటీలకు కామవరపుకోట మండలం రావికంపాడు క్రీడాకారుడు శొంఠి రాంబాబు అర్హత సాధించాడు. జనవరి 27వ తేదీన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్రస్థాయి పారా ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఏలూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన రాంబాబు షాట్‌పుట్ విభాగంలో 8.05 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు. దీంతో ఈ నెల 17 నుంచి 21 వరకూ ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే జాతీయ పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు.


