
రంగులు వేస్తూ జారిపడి పెయింటర్ మృతి
భీమవరం: భవనానికి రంగులు వేస్తూ ప్రమాదవశాత్తూ పెయింటర్ జారి పడి మృతి చెందిన ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం స్థానిక మారుతీనగర్‌లోని ఓ ఇంటికి పెయింటర్ చీర శివకుమార్(34) శుక్రవారం రంగులు వేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం నుంచి విజయవాడ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మామపై అల్లుడు హత్యాయత్నం
ఏలూరు టౌన్: మామపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం ఏలూరు తంగెళ్ళమూడి కబడ్డీగూడెంకు చెందిన ధర్మవరపు శ్రీను కుమార్తె జ్యోతికి కొత్తపల్లి వెంగళరావుతో 18 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వెంగళరావు మద్యానికి బానిసై ఇటీవల కాలంలో భార్య జ్యోతిని ఇష్టారాజ్యంగా కొడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 14న భర్త వేధింపులు భరించలేక జ్యోతి తండ్రి ఇంటికి వచ్చింది. వెంగళరావు అక్కడకు రావడంతో మామ అల్లుడి మధ్య వాగ్వివాదం చెలరేగి గొడవగా మారింది. అనంతరం మరోసారి రాత్రివేళ రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.అల్లుడు వెంగళరావు తనతో తెచ్చుకున్న కత్తితో మామ శ్రీనుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. భార్య లక్ష్మి, మనవడు కొత్తపల్లి నాగు శ్రీనుని ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి ఆసుపత్రిలోని పోలీస్ ఔట్‌పోస్టుకు సమాచారం అందించారు. ఏలూరు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలు
ఉంగుటూరు: జాతీయరహదారిపై శనివారం కై కరం నుంచి భీమడోలు వెళుతున్న రెండు బైకులు ఢీకొని నలుగురుకి తీవ్రగాయాలు అయ్యాయి. ముందు వెళుతున్న బైక్‌ను ఓవర్‌టేక్ చేస్తుండగా రెండు బైక్‌ల హేండిళ్లు లింక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులది కూరెళ్లగూడెం, పత్తేపురం గ్రామాలు అని తెల్సింది. క్షతగాత్రులు కె.సుగుణ (38), కె.శాంతిరాజు (39), జాన్సి (46), సాయికిరణ్(24) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.