
గోవుల అక్రమ రవాణా అడ్డగింత
కుక్కునూరు: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న గోవులను స్థానికులు పట్టుకుని వెటర్నరీ సిబ్బందికి అప్పగించారు. వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన గోవులను కొందరు గురవారం ఉదయం వింజరం రేవు వద్ద గోదావరి దాటించి తీసుకెళ్లడాన్ని గమనించిన స్థానికులు విలేకరులకు, వెటర్నరీ ఏడీకి సమాచారం అందించారు. వెంటనే ఆ శాఖ సిబ్బంది వచ్చి తనిఖీ చేసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో గోవులను బందెలదొడ్డికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై బీజేపీ, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణాకు కుక్కునూరు మండలం రాజమార్గంలా తయారైందని విమర్శించారు. అధికారులు గోవులను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెంలో
రోడ్డు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: పట్టణంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వారకాతిరుమల నుంచి గోపాలపురం వెళుతున్న కారు పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తి సీటు బెల్టు ధరించి ఉండడంతో కారులో బెలూన్‌లు తెరుచుకోవడంతో కారులోని వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో సదరు ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్థంభం విరిగి కింది పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
స్వర్ణలతకు
సూపర్ ఉమెన్ అవార్డు
పాలకోడేరు: సెయింట్ జాన్స్ వెల్ఫేర్ సొసైటీ అధినేత డాక్టర్ డీఆర్ స్వర్ణలతకు ‘ఝాన్సీ లక్ష్మీబాయి సూపర్ ఉమెన్–2025’ అవార్డు వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కె.శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకున్నట్లు ఆమె స్థానిక విలేకరులకు ఫోన్‌లో తెలిపారు. గత 25 సంవత్సరాలుగా సమాజానికి తాను చేస్తున్న సేవను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారని ఆమె వివరించారు.

గోవుల అక్రమ రవాణా అడ్డగింత

గోవుల అక్రమ రవాణా అడ్డగింత