కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్ప్రతిలో వసతుల పరిశీలన, రోగుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన కాలికి, చేతికి గాయమైంది. తీవ్రనొప్పితో కన్నీరుపెట్టుకున్నారు. పెచ్చులూడిన సంఘటనలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మానవతా దృక్పదంతో వచ్చిన వినయ్‌భాస్కర్‌ను ఎందుకు పంపించరా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న మహిళలు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ, తిరగబడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజులక్రితం ఆస్పత్రిలో భవనంపై పెచ్చులు ఊడి రోగులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిలోకి ఎవరూ రాకుండా పోలీసులు మొదటి గేట్, రెండో గేట్‌తో పాటు మార్చురీ గేట్ సైతం బంద్ చేశారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మార్చురీ గేట్‌పక్కన ఉన్న ప్రాంతం నుంచి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒకేసారి తరలిరావడంతో తోపులాట జరిగింది. వినయ్‌భాస్కర్‌కు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వినయభాస్కర్‌పై పడటంతో కాలికి, చేతికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు తనపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు కడుపులో తంతూ, కాళ్లు తొక్కారని కన్నీరు పెట్టారు. రోగులకు సరిపడా బెడ్లు కేటాయించకుండా, అంబులెన్స్ కొరత తీర్చకుండా ప్రశ్నించేవారిపై దాడులు చేయించడం నిరంకుశ ప్రభుత్వానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం వెలిబుచ్చారు. చివరికి ఆయన అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలిస్తుండగా, తనను ఎంజీఎంకు తీసుకెళ్లాలంటూ మొరపెట్టుకున్నారు. కానీ, శాంతిభద్రతల దృష్టా ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతున్న దాస్యంను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పరామర్శించారు.
బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో..
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఎంజీఎంకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు పోతన నగర్ జంక్షన్ వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ పాల్గొని, పోలీసులు, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సీఐ కరుణాకర్‌రావు వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు.
పోలీసుల పహారాలో ఎంజీఎం
ఎంజీఎం ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో పోలీసులు బందోబస్తును పెంచారు. మీడియా ప్రతినిధులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆస్ప్రతికి ఉన్న మూడు గేట్లను బంద్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్లను చూసేందుకు వచ్చిన అటెండెంట్లకు వెతలు తప్పలేదు. వారిని కూడా వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులను వారి ఐడెంటిటీ కార్డు పరిశీలించిన తర్వాతనే లోనికి పంపించారు. డ్రగ్స్ స్టోర్ నుంచి మందులను తీసుకొచ్చిన వాహనాన్ని సైతం బయటనే ఆపినట్లు తెలిసింది.
మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను
అడ్డుకున్న పోలీసులు
కాలికి, చేతికి గాయం..ఆస్పత్రిలో చికిత్స
పోలీసులు కడుపులో తన్నారని కన్నీరు పెట్టిన దాస్యం
బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో
సీపీఎం నాయకుల ఆందోళన
ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆస్పత్రి గేట్ వద్ద ఆందోళన చేశారు. లోపలికి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పనులు త్వ రగా పూర్తి చేసి కొత్త ఆస్పత్రిని ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.


