ట్రాన్స్‌కోలో వివాదాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కోలో వివాదాలు

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

ట్రాన్స్‌కోలో వివాదాలు

యాజమాన్యం సీరియస్‌

హన్మకొండ: టీజీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ట్రాన్స్‌కో) వరంగల్‌ జోన్‌ కార్యాలయంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులను బెదిరించి బలవంతంగా ఉత్తర్వులు మార్పించడాన్ని ట్రాన్స్‌ కో యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఒకే తేదీతో ఇద్దరు డీఈలకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇవ్వడం, ఇన్‌చార్జ్‌ బాధ్యతల ఉత్తర్వులు పొందడంలో జరిగిన దౌర్జన్యంపై సోమవారం ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి హనుమకొండలోని టీజీ ట్రాన్స్‌కో వరంగల్‌ జోన్‌ కార్యాలయానికి విజిలెన్స్‌ అధికారులు చేరుకుని రోజంతా జరిగిన ఘటన, దౌర్జన్యం, ఇన్‌చార్జ్‌ ఉత్తర్వుల జారీపై వివరాలు సేకరించారు. విజిలెన్స్‌ నివేదిక అనంతరం పూర్తిస్థాయిలో శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు.

ఏం జరిగిందంటే..

ట్రాన్స్‌కో వరంగల్‌ జోన్‌ కార్యాలయంలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ జనగామ డీఈగా పని చేస్తున్న ఐ.సుదాకర్‌రావు ఈనెల 5 నుంచి 19 వరకు సెలవులో వెళ్లారు. ఈవిభాగంలో పాలనాపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా జాప్యం కాకుండా ఉండేందుకు ఈనెల 10న వరంగల్‌ ఎంఆర్‌టీ అండ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ డీఈ టి.రాజుకు ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ మురళీసాగర్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన టి.రాజు సజావుగా విధులు నిర్వహిస్తుండగా.. ఈనెల 18న వరంగల్‌ కన్‌స్ట్రక్షన్‌ డీఈ ఎల్‌.సంపతిరావు తనపై దౌర్జన్యం చేసి బలవంతంగా పాత (10వ) తేదీతో టి.రాజుకు అప్పగించిన బాధ్యతలు రద్దు చేస్తూ, తనకు అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు ఒత్తిడి తీసుకొచ్చి ఉత్తర్వులు ఇప్పించుకున్నారని వరంగల్‌ జోన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మురళీసాగర్‌ టీజీ ట్రాన్స్‌కో గ్రిడ్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇద్దరు డీఈలకు ఈ నెల 10వ తేదీతో అదనపు బాధ్యతలు అప్పగించినట్లు మెమోలు జారీ అయ్యాయి.

ఆంతర్యమేంటి?

విచిత్రమేంటంటే జనగామ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ డీఈ ఐ.సుధాకర్‌రావు ఈ నెల 19వ తేదీ వరకు సెలవు పెట్టారు. అయితే ఈనెల 18న అంటే ఒక రోజు ముందుగా బలవంతంగా ఎల్‌.సంపతిరావు అదనపు బాధ్యతలు పొందడంలో ఉన్న ఆంతర్యమేంటని ట్రాన్స్‌ కో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అప్పటికే అదనపు బాధ్యతలు చేపట్టిన టి.రాజు పాలనాపరమైన ఫైళ్లపై సంతకాలు చేయడం, కార్యకలాపాలు కొనసాగడం జరిగాయి. ఈనెల 18న పాత (10వ) తేదీతో అదనపు బాధ్యతలు పొందిన డీఈ గతంలో జరిగిన కార్యకలాపాలు ఎలా మేనేజ్‌ చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. డీఈ టి.రాజు సంతకాలతో కదిలిన ఫైళ్లు రద్దు చేయగలుగుతారా? కొత్తగా పాత తేదీతో అదనపు బాధ్యతలు పొందిన డీఈ కోసం తిరిగి ఫైళ్లు పునరుద్ధరిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పరువు తీసుకుంటున్న ఇంజనీర్లు!

ఇద్దరికి అదనపు బాధ్యతలు వివాదంగా మారాయి. కాగా, సెలవులో వెళ్లిన డీఈ ఐ.సుదాకర్‌రావు సోమవారం విధుల్లో చేరారు. అయితే, సుదాకర్‌ రావు ఎవరి నుంచి చార్జ్‌ తీసుకోవాలనే మీమాంస నెలకొనగా.. ట్రాన్స్‌కో మానవ వనరుల విభాగంగా ముందుగా అదనపు బాధ్యతలు స్వీకరించిన డీఈ టి.రాజు నుంచి చార్జ్‌ తీసుకోవాలని వచ్చిన ఆదేశాల మేరకు ఐ.సుదాకర్‌రావు బాధ్యతలు చేపట్టారు. ఎల్‌.సంపతిరావుకు ఇచ్చిన అదనపు బాధ్యతలను ట్రాన్స్‌కో యాజమాన్యం పరిగణనలోకి తీసుకోలేదని దీంతో స్పష్టమైంది. 15 రోజుల అదనపు బాధ్యతలపై ఇంజనీర్స్‌ పరువు తీసుకుంటున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డీఈ టి.రాజుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జారీ చేసిన మెమో

దౌర్జన్యం చేసి బలవంతంగా ఉత్తర్వులు జారీ చేయించుకోవడాన్ని ట్రాన్స్‌కో యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణిస్తున్నట్లు ట్రాన్స్‌ కో ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఈమేరకు విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు ట్రాన్స్‌ కో సీఎండీ ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇంకో వైపు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ఎల్‌.సంపతిరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం హైదరాబాద్‌లో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ మేడి రమేశ్‌ తెలిపారు. సంపతి రావుపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అధికారిపై వివక్షతో అగ్రకుల అహంకారంతోనే దౌర్జన్యం, దాడి చేశారన్నారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉన్నతాధికారిపైనే దౌర్జన్యం చేస్తే కింది స్థాయి అధికారుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement