సమయపాలన ఏది? | - | Sakshi
Sakshi News home page

సమయపాలన ఏది?

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

నర్సంపేట రూరల్‌: నర్సంపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి సమయపాలన లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా ఆస్పత్రికి వస్తూపోతుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో ఏకై క మెడికల్‌ కళాశాల ఆస్పత్రి నర్సంపేట ప్రాంతానికి కేటాయించారు. ఆ కళాశాలలోని ఆస్పత్రిలో ఓపీ సేవలు సకాలంలో నిర్వహించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడం, సమయం కాకముందే వెళ్లిపోవడంతో రోగుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఓపీలో వైద్యులు సుమారు మూడు గంటలకు కూడా సేవలందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉదయం పది గంటలైనా..

నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ రిజిస్ట్రేషన్‌ కౌంటర్లను ఉదయం పది గంటలైనా ఓపెన్‌ చేయడం లేదు. దీంతో ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువగా వచ్చి క్యూలైన్‌లో నిలబడే పరిస్థితి ఉంది. వైద్యసిబ్బంది 9.30 గంటలకు వస్తే వైద్యులు ఏకంగా ఉదయం 10 నుంచి 11గంటల మధ్యలో వస్తున్నారు. ప్రతీ రోజు 2గంటల వరకు ఓపీ నడవాల్సి ఉండగా ఓపీ సేవలు కేవలం గంటకే మూసివేస్తున్నారు. ఇక ఫార్మసీలో రోగులకు సరైన మందులు ఉండటం లేదని పలువులు వాపోతున్నారు. వైద్యులు రాసిన మందులకు సగం వరకే ఇస్తుండటంతో మరో సగం మందులకు ప్రైవేట్‌ మెడికల్‌షాపులను ఆశ్రయించాల్సి వస్తుందని రోగులు చెబుతున్నారు.

డీఎంఈ పరిధిలోని ఓపీ వేళలు..

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బోధన ఆస్పత్రుల్లో ఒకే రోజు పరీక్షలు, వైద్యం పూర్తయ్యేలా ఓపీ వేళలను పొడిగించారు. ఓపీ రిజిస్ట్రేషన్‌ ఉదయం 8 గంటల నుంచే రోగులకు జారీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలు ఎవరూ పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

చర్యలు తప్పవు

నర్సంపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలి.

–దామోదరాబాయి,

నర్సంపేట ఆస్పత్రి సూపరింటెండెంట్‌

నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యం

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement