జిల్లా సాగైన పంటల వివరాలు (ఎకరాల్లో) | - | Sakshi
Sakshi News home page

జిల్లా సాగైన పంటల వివరాలు (ఎకరాల్లో)

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

ఖిలా వరంగల్‌: ఎరువుల పంపిణీలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాంకేతికను అందిపుచ్చుకుంది. ఎరువుల నిల్వలు, విక్రయాలు, రైతుల పంపిణీ వివరాలు పక్కాగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ను అమలులోకి తీసుకొచ్చింది. పంటలకు అవసరమయ్యే కాంప్లెక్స్‌ ఎరువులు, యూరియాను ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌లో బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను యాప్‌ ద్వారానే అధికారులు నిర్వహించనున్నారు. దీంతో డీలర్ల వద్ద ఎరువుల నిల్వలు, రైతులకు జరిగిన పంపిణీపై అధికారులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందనుంది.

నిర్ణీత ధరకే అమ్మేలా..

ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, రైతులకు నిర్ణీత ధరకే అందేలా కేంద్ర ప్రభుత్వం

చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు యూరియా విక్రయాలకు మాత్రమే అమలులో ఉన్న యాప్‌ విధానాన్ని ఇకపై అన్ని రకాల ఎరువులకు విస్తరించనుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ (ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌) యాప్‌ అమల్లోకి రానుంది. యాప్‌ ద్వారా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌, ఎంఓపీ, ఎస్‌ఎస్పీ తదితర ఎరువుల విక్రయాలు చేపట్టనున్నారు. దీంతో స్టాక్‌ దాచిపెట్టి అధిక ధరకు విక్రయించడం, రైతులను తప్పుదోవ పట్టించడం వంటి అక్రమాలకు చెక్‌ పడనుంది.

ఏ షాపులో ఎంత

నిల్వ ఉంది?

యాప్‌లో ఎరువులు బుకింగ్‌ చేసుకున్న తర్వాత రైతులు ఆయా షాపుల వద్ద ఎక్కువ సేపు నిలబడాల్సిన అవసరం లేదు. ముందుగానే బుకింగ్‌ చేసుకుంటారు కాబట్టి రైతు సమయం లభ్యతను బట్టి యూరియా తీసుకోవచ్చు. పారదర్శకంగా, వేగంగా ఎరువుల పంపిణీ జరగనుంది. పైగా ఏ దుకాణంలో ఎంత నిల్వ ఉందనే విషయాన్ని రైతులే యాప్‌ ద్వారా తెలుసుకుని బుకింగ్‌ చేసుకోవచ్చు.

క్యూఆర్‌ కోడ్‌, బుకింగ్‌ ఐడీ..

రైతులు ఎరువులు బుకింగ్‌ చేసుకున్న తర్వాత క్యూఆర్‌ కోడ్‌, బుకింగ్‌ ఐడీ జనరేట్‌ అవుతుంది. ఎంపిక చేసుకున్న దుకాణానికి వెళ్లి క్యూఆర్‌ కోడ్‌ చూపింపి ఎరువులు పొందవచ్చు. అయితే స్వయంగా తీసుకుంటారా? లేదా కౌలు రైతు తీసుకుంటారా అనేది బుకింగ్‌ సమయంలో ఎవరైతే ఎరువులు తీసుకుంటారో వారి ఆధార్‌, సెల్‌ నంబర్‌ నమోదు చేస్తే ఆ పేరుతోనే క్యూఆర్‌కోడ్‌ జనరేట్‌ అవుతుంది. ఇందులో ఏమైన సందేహాలు ఉంటే స్థానిక ఏఓలు, ఏఈఓలను సంప్రదించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి పేర్కొన్నారు.

జిల్లాలో పారదర్శకంగా

పంపిణీకి ఏర్పాట్లు

ఎరువుల నిల్వలపై ఎప్పటికప్పుడు

స్పష్టమైన సమాచారం

సాంకేతికతను అందిపుచ్చుకున్న

వ్యవసాయ శాఖ

ఫార్మర్‌ రిజిస్ట్రీ ఉంటేనే..

కొత్త విధానంలో రైతులు ఫార్మర్‌ రిజిస్టర్‌ నంబర్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్‌ అయి ఎరువులు కొనుగోలు చేయాలి. రిజిస్ట్రర్‌ చేసుకున్న రైతుల భూ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. ఇంకా నమోదు చేసుకొని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సహకరించనున్నారు. యాప్‌ ద్వారా విక్రయాలు జరిగితే ఏ రైతు ఏ ఎరువు ఎంత కొనుగోలు చేశారన్న సమాచారం నమోదవుతుంది. డీలర్లు స్టాక్‌ లేదని సాకులు చేప్పే అవకాశం ఉండదు. బ్యాగుపై ప్రింట్‌ చేసిన ఎంఆర్పీ ధర (ముద్రిత) కంటే ఎక్కువకు విక్రయించడం, సాధారణ కంపెనీ ఎరువులు బ్రాండెడ్‌ పేరుతో విక్రయించడం వంటివి అరికట్టేందుకు ఈ విధానం దోహదపడుతోంది. ఒక్కో ఎకరానికి ఎంత ఎరువు వాడుతున్నారనే పర్యవేక్షణకు కూడా అవకాశం ఉంటుంది.

పత్తి 1,20,044

వరి 69,272

మొక్కజొన్న 18,609

వేరుశనగ 833

సోయా 358

ఇతర పంటలు 15,609

రైతులు 1,54,674

ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 2,25,082లక్షలు

పారదర్శకత కోసమే..

ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత తీసుకురావడం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ప్రధాన ఉద్ధేశం. డీలర్ల వద్ద ఉన్న నిల్వల నుంచి రైతులకు పంపిణీ చేసే వరకు ప్రతీ దశను యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తాం. రైతుల వివరాలు యాప్‌లో నమోదు చేసి ఎరువులు అందిస్తాం. అక్రమ నిల్వలు, పక్కదారి పట్టించడం, అధిక ధరలకు విక్రయించడం తదితర వాటికి అడ్డుకట్ట వేస్తాం. రైతులకు అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటాం.

– విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement