నర్సంపేట: ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని, అర్హులైన ప్రతీ కుటుంబానికి గౌరవ ప్రదమైన నివాసం కల్పించడమే లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని 20వ డివిజన్‌కు చెందిన కొండోజు గీతాచరణ్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
ఖిలా వరంగల్: తైమాసిక తనిఖీలో భాగంగా ఆదివారం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌యార్డులోని ఈవీఎం గోదామును కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో అమలులో ఉన్న భద్రతా చర్యలు, నిర్వహణ ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిబంధనలను అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల్లో డీఆర్వో విజయలక్ష్మీ, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనతో
ప్రజల ఇబ్బందులు
వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీ ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పోరుబాటలో భాగంగా ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీల అమలులో విఫలమైందన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, తమ పాలనలో ప్రజల బాధలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్ సిలువేరు కుమారస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణి ఉ దయం 10గంటలకు ప్రారంభమవుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల రద్దీ
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


