పరకాల: మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుదీరి ఆరు నెలలు కూడా కాలేదు.. అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. శనివారం పరకాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఏకంగా ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు డమ్మా కొట్టడమే ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. అభివృద్ధి పనుల విషయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్‌కు.. అధికార పార్టీలోని కొందరు కౌన్సిలర్లకు కొంతకాలంగా అభివృద్ధి పనుల విషయంలో వివాదం చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. పరకాలలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం.. కేటాయింపుల విషయంలో చైర్మన్ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ స్వయంగా కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మొర పెట్టుకున్నట్లు సమాచారం. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చైర్మన్‌తో మాట్లాడతానన్న ఎమ్మెల్యే హామీతో సయోధ్యకు వచ్చినట్లు తెలిసింది. కానీ, పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మున్సిపల్ కౌన్సిల్‌కు గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరైనప్పటికీ.. అలిగిన కౌన్సిలర్లు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ కౌన్సిలర్లలో వాటాల గొడవలు: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాటాల గొడవలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పరకాలకు వచ్చినా పరకాల పట్టణాభివృద్ధికి పైసా నిధులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని, సీఎం రాక సందర్భంగా పరకాల మున్సిపాలిటీ తరఫున రూ.30 లక్షలు ఖర్చుపెట్టినట్లు చూపించారన్నారు. కానీ, పరకాలకు సీఎం వచ్చి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం.. పరకాల అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. పరకాలలో నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ పరకాలలో ఇచ్చి జంక్షన్‌గా మార్చాలని, పరకాల మార్కెట్‌ను ఏ–1గా అభివృద్ధి చేయాలని, ఎడ్యుకేషన్ హాబ్‌గా మార్చాలంటే నర్సంపేట తరహాలో పరకాలకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని సూచనలు చేసినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కాగా, పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండే మున్సిపాలిటీ కౌన్సిల్‌కు అధికార పార్టీ కౌన్సిలర్లే గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో వినాయక చవితి ఏర్పాట్లు, శానిటేషన్ నిర్వహణ, కొత్త సీసీ రోడ్లు, రెవెన్యూ కలెక్షన్స్, నూతన డ్రెయినేజీల నిర్మాణం, పట్టణంలోని అమరధామంలో అమరవీరుల విగ్రహాలకు మరమ్మతులు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ అంశంపై చర్చ జరిగింది. మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పవన్, వైస్ చైర్‌పర్సన్ ఏకు దివ్యతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు.
చైర్మన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్ల నుంచి వ్యతిరేకత
అభివృద్ధి పనుల విషయంలో వివాదమే కారణం!
ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా కుదరని సయోధ్య


