వరంగల్ చౌరస్తా: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం చేయడంపై శనివారం వర్సీటీ ఆవరణలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్లాట్ బుక్ చేసుకున్నామని, అపాయింట్‌మెంట్ రావడంతో పూణే, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకే యూనివర్సిటీకి చేరుకున్నారు. సంతకం కాలేదనే సాకుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు లిస్ట్ వెల్లడించకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత ఉందని, కేవలం నలుగురు స్టాఫ్‌తోనే పనులు చూసుకోవాల్సి వస్తోందని అధికారులు చేతులెత్తేశారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్వరగా సర్టిఫికెట్లు ఇచ్చి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ చౌరస్తా: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సామాన్యుల కష్టాలు వర్ణనాతీతం. వరంగల్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఎస్‌ఐఆర్ క్లియరెన్స్‌పై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఈ ఘటన మచ్చుతునక. శనివారం ఎస్‌ఐఆర్ ఓటు అప్లికేషన్ క్లియరెన్స్ కోసం ఓ తల్లి తన నాన్న, తన పసికందుతో కలిసి కార్యాలయానికి వచ్చారు. రెండు గంటలకుపైగా వేచి ఉండడం.. మరోవైపు పసికందు ఏడుస్తుండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పక్కనే ఉన్న టేబుల్‌పై పడుకోబెట్టి అప్పటికప్పుడు బాటిల్, పాలు కొని ఆకలి తీర్చింది. ఈ దృశ్యం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి న పౌరులను కలచివేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు సౌకర్యంగా, వేగవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కాజీపేట: పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలపై మదర్ థెరిస్సా చూపిన ప్రేమ, ఆప్యాయతలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవా లని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మదర్ థెరిస్సా వర్ధంతిని పురస్కరించుకుని కాజీపేట 61వ డివిజన్ ఫాతిమానగర్ జంక్షన్‌లోని విగ్రహానికి కెథ్రడల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి శనివారం నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్.రాజ్‌మోహన్ రావు, సాగరిక రెడ్డి, బొక్క దయసాగర్, టీడీ టామి, తిరుణహరి శేషు, పుల్లూరు సుధాకర్, అల్లం ప్రకాశ్ రెడ్డి, ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా ఉన్న నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు.


