శాయంపేట: మండలంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా సురక్షిత నీరందేలా చర్యలు తీసుకోవాలని హమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని జోగంపల్లిలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా రా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది? పంపుల పనితీరు క్లోరినేషన్, ఇన్‌ట్రా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, పంపింగ్ తీరును అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు కలుషితమవుతోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన కలెక్టర్ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి వస్తున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వ్యర్థ జలాలు పంట పొలాలకు వెళ్లకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆమె వెంట మిషన్ భగీరథ ఇంట్రా ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రి, వాటర్ గ్రిడ్ ఈఈ సురేందర్, సాగు నీటిపారుదల శాఖ ఈఈ సునీత, ఇతర అధికారులు ఉన్నారు.
● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
● జోగంపల్లి మిషన్ భగీరథ ప్లాంట్ పరిశీలన


