● అత్తకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
● కుటుంబ తగాదాలే కారణం
కమలాపూర్: కుటుంబ తగాదాలతో ఓ అల్లుడు కారుతో పిల్లనిచ్చిన అత్తను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అంబాలలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు మండలం పెద్దాపురానికి చెందిన నాగనబోయిన రవి–స్వరూప దంపతుల కూతురు అనితతో అంబాలకు చెందిన బండవరం కృష్ణకాంత్‌కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లుగా రెండు కుటుంబాల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అత్త స్వరూప, మామ రవి, భార్య అనిత, మరొకరితో కలిసి అంబాలలో కృష్ణకాంత్ కుటుంబీకులపై దాడి చేసి గాయపరిచారు. దీంతో కృష్ణకాంత్ కోపంతో కారుతో అత్త స్వరూపను ఢీకొట్టాడు. ఆమె పొట్టపైనుంచి కారు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. హసన్‌పర్తి 108సిబ్బంది ఈఎంటీ ప్రకాశ్, పైలట్ నాగరాజు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం స్వరూప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానిక ఇన్‌స్పెక్టర్ నవీన్ సిబ్బందితో కలిసి వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ నవీన్‌ను వివరణ కోరగా ఇరువర్గాల వారు పరస్పర దాడులు చేసుకున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం వారందరూ ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు తమకెలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


