22న దివ్యాంగుల ఉద్యోగాలకు ప్రత్యేక స్క్రీనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

22న దివ్యాంగుల ఉద్యోగాలకు ప్రత్యేక స్క్రీనింగ్‌

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

కాశిబుగ్గ: జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగుల ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌ శిబిరం ఈనెల 22న ములుగు రోడ్డులోని ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ బి.సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగ యువతను గుర్తించి, వారి నైపుణ్యాలను అంచనా వేసి, ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ కార్పొరేట్‌, ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి, పదవ తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు అర్హులన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు బయోడేటా, సదరం సర్టిఫికెట్‌, ఆధార్‌, పాన్‌కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలు, రెండు పాస్‌ఫోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 733063 7711, 9281408587 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఇంటర్‌ విద్యలో

ఆధునిక బోధన

కాళోజీ సెంటర్‌: ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ సిలబస్‌ను మార్చినట్లు డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో మంగళవారం అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ మాట్లాడుతూ జనరల్‌ విభాగంలో చదివే విద్యార్థుల కోసం తెలుగు ద్వితీయ భాషా పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నూతన శైలిలో రూపొందించారని, సమకాలీన అంశాలు, నైతిక విలువలు, సృజనాత్మకత పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలను చేర్చారన్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్రిమ మేథ(ఏఐ) డిజిటల్‌ తరగతుల ద్వారా బోధన అందించేందుకు ప్రణాళిక ఉందన్నారు. అధ్యాపకులు మూల్యాంకనం, అభ్యసన మార్కుల విభజన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ శ్రీనివాస్‌రావు, మాధవరావు, పరశురాం, శ్రీదేవి, అధ్యాపకులు, రిసోర్స్‌పర్సన్స్‌ పాల్గొన్నారు.

ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలి

గీసుకొండ: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రాజారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశ నోడల్‌ సూపర్‌వైజర్లు, ఎంసీహెచ్‌ సూపర్‌వైజర్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ గర్భిణీకి కనీసం నాలుగు సార్లు ఏఎన్‌సీ చెకప్‌లు జరిగేలా చూడాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి వారికి సత్వర వైద్యసేవలు అందించాలన్నారు. మాతాశిశు ఆరోగ్యంపై వైద్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఐఓ డాక్టర్‌ ప్రకాశ్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సజిదా, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎస్‌ఓ ప్రసన్నకుమార్‌, డీపీహెచ్‌ఎన్‌ మనోజ్‌, డీపీఓ అర్చన తదితరులు పాల్గొన్నారు.

డీఎంఓగా నాగరాజు

బాధ్యతల స్వీకరణ

ఖిలా వరంగల్‌: వరంగల్‌ జిల్లా మార్కెటింగ్‌ అధికారిగా నాగరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎంఓ కలకోట్ల సురేఖ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మెదక్‌ జిల్లా డీఎంఓ నాగరాజును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదను మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement