● స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
కడియం శ్రీహరి
● 46వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు
శంకుస్థాపన
ధర్మసాగర్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధిలోని స్టేషన్‌పెండ్యాలలో రూ.50 లక్షలు, రాంపూర్ గ్రామంలో రూ.1.50 కోట్లతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల పనులతో పాటు రూ.40 లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క రోజే రూ.2.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, వీటిని మూడు నెలల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నాలుగు నెలల వ్యవధిలోనే రాంపూర్ గ్రామానికి రూ.6.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొదటి విడత రాంపూర్ గ్రామానికి 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో 15 రోజుల్లో రెండో విడత కింద మరో 50 ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న అర్హులకు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతికి పాల్పడలేదని, నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తన లాంటి ప్రజాప్రతినిధులకు ప్రజల మద్దతు ఎల్లప్పుడు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మునిగాల సరోజన, డివిజన్ ప్రెసిడెంట్ భిక్షపతి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


